క్రూడ్ ధర తగ్గినా.. దేశీయంగా తగ్గని పెట్రోల్ ప్రైస్

By narsimha lodeFirst Published Mar 1, 2020, 1:08 PM IST
Highlights

అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ రిటైల్‌ ధరలు మండుతూనే ఉన్నాయి.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ రిటైల్‌ ధరలు మండుతూనే ఉన్నాయి. కానీ మన దగ్గర ధరలు ఎప్పుడు తగ్గుతాయి.. తగ్గిన ముడిచమురు ధరల ప్రభావం మనదేశంపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

నెల రోజుల్లో అంతర్జాతీయంగా ముడిచమురు ధర 20 శాతం పైగా తగ్గి, బ్యారెల్‌ 50 డాలర్లకు చేరింది. దేశీయంగా చూస్తే, ఆ స్థాయిలో పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గ లేదు. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.89, డీజిల్‌ రూ.64.51గా ఉంది. 

2017 సెప్టెంబర్-అక్టోబర్ మధ్య బారెల్‌ క్రూడాయిల్ ధర 54-56 డాలర్ల మధ్య ఉన్నపుడు లీటర్ పెట్రోలు ధర రూ.69-70 మధ్య, డీజిల్‌ ధర రూ.57-58 మధ్య ఉంది. 2018-19 డిసెంబర్-జనవరిలోనూ ముడి చమురు బ్యారెల్ ధరలు 57-59 డాలర్ల స్థాయిలో ఉన్నా, పెట్రోల్ రూ.71, డీజిల్ రూ.64గానే ఉన్నాయి.

వాస్తవానికి ప్రస్తుత స్థాయి కంటే కనీసం లీటరు పెట్రోల్ ధర రూ.3-5 వరకు ధర తగ్గాల్సి ఉండాలని అంచనా వేస్తున్నారు. అయితే తమ నష్టాలు కొంతైనా తగ్గించుకోవడానికి కంపెనీలు అంతర్జాతీయ స్థాయిలో మరీ ఎక్కువగా ధరలను తగ్గించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనమైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కంపెనీలు అంటున్నాయి.

గత ఏడాదిలో రూపాయి రూ.68 నుంచి రూ.71కి పతనమైందని.. దీనిని లెక్కలోకి తీసుకుంటే రూ.1-2 మాత్రమే అధికంగా ఉండాలని, ప్రస్తుత ధరలు మాత్రం లీటర్‌పై రూ.3 వరకు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

తగ్గుతున్న ముడిచమురు ధరల కారంగా భారత ఆర్థిక వ్యవస్థకే కాక విమానయానం, నౌకాయానం, రోడ్డు, రైల్వే రవాణా వంటి వాటికి కొంతైనా ప్రయోజనం దక్కనుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో చమురుకు గిరాకీ తగ్గడం.. భారత్‌ వంటి భారీ దిగుమతి దేశాలు ధరపై బేరం ఆడడానికి పనికొచ్చే అంశం.

ఇప్పటికే అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఏఈఏ) అంతర్జాతీయ చమురు గిరాకీ వృద్ధిలో కోత వేసింది. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరల తగ్గుదల వల్ల భారత విమానయాన సంస్థలకు ఉపశమనం కలుగుతుందని చెప్పొచ్చు. కొంత కాలంగా నష్టాల్లో ఉన్న ఇవి తాజా పరిణామాల వల్ల కొంతైనా నష్టాలను పూడ్చుకోవచ్చు. 

గతంలోనూ తగ్గిన చమురు ధరల వల్ల విమానయాన సంస్థల లాభదాయకత మెరుగుపడింది. ఆర్థిక మందగమనంలోనూ భారత విమాన ప్రయాణికుల రద్దీలో 3.7 శాతం మేర వృద్ధి నమోదైంది. ప్రభుత్వ ఖజానాకూ చమురు ధరలు చల్లారడం ఊరట కలిగిస్తుంది. ద్రవ్యలోటు విషయంలో ఇప్పటికే తడబడ్డ ప్రభుత్వం లక్ష్యాన్ని 3.5 శాతం నుంచి 3.8 శాతానికి(2019-20) పెంచుకుంది. 

Also read:ట్రామ్.. రైలు.. బస్సు అన్నీ ఫ్రీ.. లగ్జెంబర్గ్ సంచనల నిర్ణయం

చమురు ధరల క్షీణత వల్ల ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం కనిపిస్తుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తి కాంత దాస్ కూడా అంటున్నారు. పెట్రో ధరలు తగ్గితే రవాణా ధరలు తగ్గి.. ఆహార వస్తువుల ధరలూ అదుపులో ఉంటాయి. 

అపుడు ఆహార ద్రవ్యోల్బణంపై.. తద్వారా టోకు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గుతుంది. దేశీయంగా రవాణా, రాష్ట్రాల పన్నుల కారణంగా పెట్రోల్‌, డిజిల్‌ ధరల్లో వ్యత్యాసాలు ఉంటున్నాయి. పరిస్థితులు చక్కబడినా బ్యారెల్‌ ముడిచమురు ధర 60-70 బారెళ్ల పరిధిలోనే కదలాడవచ్చని విశ్లేషకులు నమ్ముతున్నారు.

click me!