
అందరూ ఊహించనట్లుగానే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పైకి కదిలింది. మార్చి 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ అందించాయి. సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కొత్త రేట్లు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను మళ్లీ పెంచాయి. ఈసారి సిలిండర్ ధర రూ.105 మేర పైకి కదిలింది. అయితే ఇది కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు (19 కేజీలు) మాత్రమే వర్తిస్తుంది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కేజీలు) ధర మాత్రం ఈసారి కూడా నిలకడగానే కొనసాగుతోంది. ఎలాంటి ధర పెంపు లేదు. ఇంకా 5 కేజీల సిలిండర్ ధర కూడా పెరిగింది. రూ.27 పైకి చేరింది. దీంతో ఇప్పుడు ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.569కు పెరిగింది.
2021 అక్టోబర్ నెల నుంచి 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఎల్‌పీజీ సిలిండర్ ధర స్థిరంగానే కొనసాగుతూ వస్తోంది. రానున్న రోజుల్లో ఈ సిలిండర్ ధరలు కూడా పైపైకి చేరొచ్చు. అయితే కమర్షియల్ సిలిండర్ ధర మాత్రం పెరగుతూనే వస్తోంది.
గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పుడు ఫిబ్రవరి 1 వరకు చూస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.170 మేర పైకి చేరింది. అక్టోబర్ 1న సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1736 వద్ద ఉండేది. నవంబర్‌లో ఇది రూ.2 వేలకు పెరిగింది. డిసెంబర్‌లో రూ.2,101కు ఎగసింది. తర్వాత జనవరి, ఫిబ్రవరిలో సిలిండర్ ధర రూ.1907కు దిగివచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ సిలిండర్ ధర పెరిగింది. తాజా పెంపుతో సిలిండర్ ధర రూ.2012కు ఎగసింది. కాగా మార్చి 7 తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.