దాదాపు రెండేళ్లుగా పరస్పర సుంకాలు విధించుకున్న చైనా, అమెరికా ఎట్టకేలకు వెనుకడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలో రెండు దేశాల అధినేతలు భేటీ కానున్నారని వార్తలొచ్చాయి.
బీజింగ్: అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదికిపైగా ఈ రెండు అగ్రదేశాలు పరస్పరం వేల కోట్ల డాలర్ల సుంకాలను విధించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది కలవరపెడుతున్న సంగతి విదితమే.
దశలవారీగా ఇప్పటిదాకా విధించుకున్న ప్రతీకార సుంకాలను వెనక్కు తీసుకునేందుకు చైనా, అమెరికా అంగీకరించినట్లు తెలుస్తున్నది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావ్ ఫెంగ్ గురువారం మీడియాకు చెప్పారు. గత రెండు వారాలుగా ఇరు దేశాల మధ్య స్పష్టమైన, నిర్మాణాత్మక సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.
also read మైక్రోసాఫ్ట్, నోకియా మరోసారి చేతులు కలపనున్నాయి...
ఈ క్రమంలోనే ఇరువైపులా విడతల వారీగా అదనపు సుంకాలను ఎత్తివేసేందుకు సమ్మతించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావ్ ఫెంగ్ చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన తుది ఒప్పందం ఖరారు కావాల్సి ఉందన్నారు. అయినా టారిఫ్‌ల ఉపసంహరణతో తొలి దశ ఒప్పందం జరిగిందని వెల్లడించారు.
అమెరికా-చైనా సంప్రదింపుల్లో ఇదే కీలక ఘట్టమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావ్ ఫెంగ్ వ్యాఖ్యానించారు. చైనా ఉప ప్రధాని ల్యూ హీ గత శుక్రవారం అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మ్నూచిన్, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి రాబర్ట్ లైథీజర్‌లతో ఫోన్‌లో మాట్లాడగా, ప్రస్తుత సంప్రదింపులపై ఇరు వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని సమాచారం.
వాణిజ్య యుద్ధం ముగిసిపోనుందన్న సంకేతాలు చైనా నుంచి వ్యక్తమవుతున్నా.. అమెరికా వైపు నుంచి మాత్రం కనిపించడం లేదు. గడిచిన ఏడాదికిపైగా కాలంలో అమెరికా-చైనా మధ్య ఎన్నోసార్లు చర్చలు, సంప్రదింపులు జరిగాయి. అయితే ప్రతీసారి అర్ధాంతరంగానే ముగియడం, ఆ తర్వాత పరస్పర సుంకాలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దఫా అలా జరుగదన్న విశ్వాసాన్ని చైనా వ్యక్తం చేస్తున్నా.. అమెరికా నోటి నుంచి మాత్రం ఆ రకమైన ప్రకటనలు రావడం లేదు.
అమెరికా నుంచి కూడా ఇదే సంతృప్తి వ్యక్తమైతే.. గ్లోబల్ ఎకానమీలో ఓ పెద్ద డీల్ కుదిరినట్లేనన్న అభిప్రాయాలు అంతర్జాతీయ సమాజం నుంచి వినిపిస్తున్నాయి. చైనాతో వాణిజ్య లోటు ప్రమాదకరంగా ఉందని, అమెరికా సంపదను చైనా దోచుకుపోతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ సుంకాల సమరానికి తెర తీసిన సంగతి విదితమే.
ఇటు తమ దేశంలోకి వస్తున్న వందలాది రకాల చైనా ఉత్పత్తులపై బిలియన్ డాలర్ల సుంకాలు ట్రంప్ వేశారు. చైనా కూడా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న అమెరికా వస్తువులపై అదే రీతిలో సుంకాలు విధించింది.
also read దటీజ్ ‘నిర్మల’మ్మ: ప్రత్యామ్నాయ నిధితో రియాల్టీకి ‘మోదీ’ బూస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. వచ్చే నెలలో లండన్‌లో కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ నెలలోనే ఇరువురి సమావేశం జరుగాలి. అయితే చిలీ ఆసియా-పసిఫిక్ దేశాధినేతల సదస్సు రద్దు కావడంతో ఈ భేటీకి వీల్లేకుండా పోయింది.
దీంతో డిసెంబర్‌లో నాటో సదస్సు తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ చర్చలకు వీలుందని వైట్‌హౌజ్ వర్గాల్లోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. డిసెంబర్ 3-4 తేదీల్లో ట్రంప్.. నాటో సమ్మిట్‌కు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే లండన్‌తోపాటు స్వీడన్, స్విట్జర్లాండ్‌లలో అధ్యక్షుల భేటీకి వీలుందన్న ఆయన ఎక్కువ అవకాశాలు మాత్రం లండన్‌కే ఉన్నాయన్నారు.