వీఆర్ఎస్...పేరుతో కింది స్థాయి ఉద్యోగులపై వేధింపు...బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరసన

By Sandra Ashok KumarFirst Published Nov 25, 2019, 1:18 PM IST
Highlights

కొన్నేళ్ల క్రితం బ్యాంకులు అమలు చేసిన వీఆర్ఎస్ పథకంతో పోలిస్తే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సంస్థలో వీఆర్ఎస్ స్కీమ్ అంత ఆకర్షణీయమేమీ కాదని ఆ సంస్థ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పెన్షన్ బెనిఫిట్లు కూడా 60 ఏళ్ల తర్వాతే లభిస్తాయని తెలిపాయి. వీఆర్ఎస్ అమలు పేరుతో కింది స్థాయి ఉద్యోగులపై వేధింపులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. 

న్యూఢిల్లీ: తప్పనిసరిగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ఎంచుకునేలా కింది స్థాయి సిబ్బందిని యాజమాన్యం భయాందోళనలకు గురి చేస్తోందంటూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ నవంబర్‌ 25వ తేదీన సోమవారం  దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు దిగనున్నట్లు సంస్థ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. 

వీఆర్‌ఎస్‌ తీసుకోని వారి రిటైర్మెంట్‌ వయస్సును 58 ఏళ్లకు తగ్గించేస్తామంటూ, దూర ప్రాంతాల్లో పోస్టింగ్స్‌ ఇస్తామంటూ మేనేజ్‌మెంట్‌ బెదిరిస్తోందని ఆలిండియా యూనియన్స్‌ అండ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ (ఏయూఏబీ) కన్వీనర్‌ పీ అభిమన్యు ఆరోపించారు.  

also read ఢిల్లీ ఖాన్ మార్కెట్లో ఒక్క అడుగు స్థలనికి రెంట్ ఎంతో తెలుసా ?

బీఎస్ఎన్ఎల్ సీఎండీ లెక్కల ప్రకారం 1.6 లక్షల మంది సంస్థ ఉద్యోగుల్లో ఇప్పటికే 77 వేల మందికి పైగా వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే తాము వీఆర్ఎస్ పథకాన్ని వ్యతిరేకించడం లేదని, అర్హులైన వారు, లబ్ధి చేకూరుతుందని భావించిన వారు వీఆర్ఎస్ ఎంచుకుంటున్నారని ఉద్యోగుల వాదన. కానీ లబ్ధి చేకూరని దిగువ శ్రేణి ఉద్యోగులను బెదిరింపులకు దిగడంపై బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల్లో నిరసన వెల్లువెత్తుతోంది. 

ప్రస్తుతం వీఆర్ఎస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్‌లో మూడో వంతు సొమ్ము 15 ఏళ్ల ముందే ఇవ్వబోరు. 60 ఏళ్ల వయస్సు దాటింతర్వాతే చెల్లిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే.. సదరు వ్యక్తి పెన్షన్ కమ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుంటే సంబంధిత కుటుంబానికి అతి తక్కువ పెన్షన్ లభిస్తుంది. వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మూడో వేతన సవరణ వర్తించదు. 

also read ఐటీ ఉద్యోగులకు కొత్త భయాలు...ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?

త్వరలో 4జీ సేవలను ప్రారంభించడంతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు మూడో వేతన సవరణకు అర్హులవుతారు. ప్రస్తుతం కొన్నేళ్ల క్రితం బ్యాంకులు ఆఫర్ చేసిన వీఆర్ఎస్ పథకంతో పోలిస్తే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ అమలు చేస్తున్నవీఆర్ఎస్ స్కీమ్ అంత ఆకర్షణీయం, లాభదాయకమేమీ కాదని ఉద్యోగులు చెబుతున్నారు. 

బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఇప్పటి వరకు దాదాపు 78 వేల మంది ఎంప్లాయిస్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఇప్పటి వరకు 13,532కు చేరినట్లు అధికారులు చెప్పారు. ఇంకా గడువు ఉండగానే రెండు సంస్థల్లో కలిపి 91 వేల మంది వీఆర్ఎస్ స్కీం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనివల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
 

click me!