జస్ట్ టెన్ మినిట్స్: రూ.5.6 లక్షల కోట్ల సంపద హరీ

By Arun Kumar PFirst Published Sep 22, 2018, 10:38 AM IST
Highlights

జెట్ ఎయిర్ వేస్ లో ఆదాయం పన్నుశాఖ తనిఖీలు.. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్‌లో అవకతవకలతో ప్రారంభంలో లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు కేవలం పది నిమిషాల్లో క్రాష్ అయ్యాయి. స్టాక్స్ లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో రూ.5.6 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.

ముంబై: స్టాక్‌మార్కెట్ అతలాకుతలం అయింది. గత నాలుగు రోజుల్లో రూ.5.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. ఎస్‌బ్యాంక్ 30% పతమైనా శుక్రవారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ లాభాల్లోనే ప్రారంభమైంది. కానీ తదుపరి హౌజింగ్ ఫైనాన్స్ షేర్లు కుప్పకూలడంతో ఒక్కసారిగా క్రాష్ అయింది. దీంతో మదుపర్లు అమ్మకాలకు పోటెత్తారు. తత్ఫలితంగా సెన్సెక్స్ నిమిషాల్లోనే 1,127 పాయింట్లు నష్టపోయింది. గతేడాది ఆగస్టు 11 తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు ఒక వారంలో అత్యధికంగా పతనం కావడం ఇదే ప్రథమం.

దివాన్ హైజింగ్ రుణపత్రాలతో తంటా
దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ జారీచేసిన రుణపత్రాలను ప్రముఖ ఫండ్లు లిక్విడిటీ కారణంగా విక్రయించాయన్న వార్తలు గుప్పుమన్నాయి. మార్కెట్‌ను మరో సబ్‌ప్రైమ్ సంక్షోభం వెన్నాడుతున్నదన్న భయాలు మదుపర్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వెరసి భారీ ఒడిదుడుకుల్లో మార్కెట్‌లో బ్లాక్ ఫ్రైడే నమోదు అయింది. చివర్లో కోలుకున్నా మార్కెట్ దీర్ఘకాల అప్‌ట్రెండ్ దెబ్బతిన్నది. 

నాలుగేళ్లలో మళ్లీ స్టాక్స్ అతి భారీ పతనం ఈనాడే
నాలుగేళ్ల తర్వాత అతి భారీగా ఒక్కరోజులోనే సెన్సెక్స్ 1,500 పాయింట్ల ఒడిదుడుకులను చవిచూసింది. మరోసారి బ్లాక్ ఫ్రైడే స్టాక్ మార్కెట్‌ను కుదిపేసింది. క్షణాల్లో మార్కెట్ కుప్పకూలింది. భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ నిమిషాల్లోనే 1127 పాయింట్లు ఆవిరైంది. కానీ ఆ వెంటనే కోలుకుని చివరగా నికరంగా 279.62 నష్టంతో ముగిసింది. ఒకదశలో మార్కెట్‌లో ఇదిగో పులి అంటే అదిగో పరుగు అన్న చందాన విక్రయాల ఒత్తిడితో మార్కెట్ అతలాకుతలం అయింది. రాణా కపూర్  పదవీకాలాన్ని పొడిగించకపోవడంతో యెస్ బ్యాంక్ 30% పతనానికి హౌజింగ్ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల పతనం తోడైంది.
 
స్టాక్స్ లో మరో బ్లాక్ ఫ్రైడే రికార్డువెరసి మార్కెట్‌లో బ్లాక్ ఫ్రైడే నమోదు అయింది. 2014 తర్వాత స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులో ఒడిదొడుకులకు గురైంది మళ్లీ ఇప్పుడే. గత నాలుగు రోజుల్లో సెనెక్స్ 1249 పాయింట్లు నష్టపోతే మొత్తం రూ. 5.6 కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ వారం మొదటి మూడు రోజుల్లో రూ. 3,434.82 కోట్ల అమ్మకాలు జరపగా, ఫ్లాష్ క్రాష్‌లో అందివచ్చిన అవకాశాన్ని కూడా వదులు కోలేదు.రూ. 760.7 కోట్ల కొనుగోళ్లు జరిపారు. 

నిఫ్టీలో ఒక్కరోజులో 500 పాయింట్ల ఒడిదొడుకులు
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ ఒక్క రోజులో 500 పాయింట్ల ఒడిదుడుకులను చవి చూడడం కూడా నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఒక దశలో మార్కెట్లో మార్జిన్ కాల్స్ పెరిగిపోయాయి. బ్రోకర్లు అంతర్గత మార్జిన్లను పెంచేశారు. రిటైల్ ట్రేడర్లు దిక్కుతోచక మార్కెట్ నుంచి బయటపడపోయారు. ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ఒకదశలో నిఫ్టీ కనీసం నాలుగు షేర్లు పది శాతం పైగా నష్టపోయాయి. డెరివేటివ్ విభాగంలో దాదాపు 20 షేర్లు పది శాతం పైగా నష్టపోయాయి. ఈదశలో డీహెచ్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ వివరణ ఇవ్వడంతో కనీస స్థాయి నుంచి కోలుకోగలిగాయి.

లాభాల్లో ముగిసిన నిఫ్టీ 27 షేర్లు 
నిఫ్టీలోని 27 షేర్లు లాభాల్లో ముగిసాయి. టీసీఎస్, రిలయన్స్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు ఇండెక్స్‌లను ఆదుకున్నాయి. టీసీఎస్ కొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయిలో ముగిసింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.69 శాతం నష్టంతో ముగిసింది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.49 శాతం నష్టపోయింది. రియాల్టి, ప్రైవేట్ బ్యాంకింగ్ ఇండెక్స్‌లు మూడున్నర శాతం నష్టపోయాయి. ఫార్మా ఇండెక్స్ 1.96 శాతం బ్యాంక్ నిఫ్టీ 2.59 శాతం నష్టపోయింది. నిఫ్టీ నెక్ట్స్ ఫిఫ్టీ ఇండెక్స్ ఒక దశలో 2000 పాయింట్లు నష్టపోయింది. బీఎస్‌ఈలో 454 షేర్లు 52 వారాల కనీస స్థాయిని తాకాయి. మొత్తం2162 షేర్లు నష్టాల్లో ముగిస్తే కేవలం 542 షేర్లు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. 

పాతాళానికి జెట్ ఎయిర్‌వేస్ షేర్లు
ఆదాయం పన్ను అధికారులు జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయాలను తనిఖీ చేశారన్న వార్తలతో ఆ కంపెనీ షేర్లు 6 శాతం మేర పతనం అయ్యాయి. దీంతో జెట్ ఎయిర్ వేస్ షేర్ కొత్త 52 వారాల కనీస స్థాయిని నమోదుచేసింది. బుధవారం కూడా ఈ షేరు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. అకౌంట్లను తారుమారు చేశారన్న ఆరోపణలతో పాటు అనుమానాస్పద లావాదేవీలు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు ఆదాయపుపన్ను శాఖ అనుమానిస్తున్నది. దీనికి తోడు సెబీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నాయి. 

ఎఫ్‌పీఐ కేవైసీ నిబంధనల సవరణ
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కేవైసీ నిబంధనల్లో సెబీ మరో సారి సవరించింది. దీంతో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లకు ఊరట లభించినట్టయింది. కొన్ని కేటగిరీల విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు బెనిఫిషరీ ఓనర్స్ (బీఓ) జాబితాను సెబీకి అందించాల్సి ఉంటుంది. ఈ సర్క్యులర్ ముందు కేటగిరి -2, కేటగిరి-3 కింద రిజిష్టర్ అయిన ఎఫ్‌పీఐలు ఇక నుంచి ఆరునెలల లోపు బీఓల జాబితాను, వారి కేవైసీ డాక్యుమెంట్లను అందచేయాల్సి ఉంటుంది. రిస్క్ ఫ్రొఫైల్ ను బట్టి ఎఫ్‌పీఐ కేటగిరిని నిర్ణయిస్తారు. రిజర్వ్‌బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ హెచ్ ఆర్ ఖాన్ ఆధ్వర్యంలోని కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా సెబీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 

యస్ బ్యాంక్ నుంచి రాణా ఔట్‌తో డౌన్ ట్రెండ్
సీఈవో రాణా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించకపోవడంతో యెస్ బ్యాంక్ షేరు భారీగా నష్టపోయింది. ఒక్క రోజులోనే రూ. 14,452 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గాల్లో కలిసిపోయింది. జనవరిలోపు కొత్త సీఈవో కోసం అన్వేషించాలని యస్ బ్యాంక్ యాజమాన్యానికి రిజర్వ్‌బ్యాంక్ తేల్చి చెప్పడంతో బీఎస్‌ఈలో రూ. 210.10 కనీస స్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో రూ. 218.10 వద్ద 52 వారాల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. యెస్ బ్యాంక్ వ్యవస్థాపన నుంచి రాణా కపూర్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఉన్నారు. ఆయన పదవీ కాలాన్నీ 2021 ఆగస్టు 31 వరకూ పొడిగించాలన్న ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. ఈ నెల 25వ తేదీన యెస్ బ్యాంక్ బోర్డు సమావేశం అయి భవిష్యత్ కార్యచరణను రూపొందించనుంది. 

కుప్పకూలిన హౌజింగ్ ఫైనాన్స్ షేర్లు
లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదన్న వార్తలతో దివాన్ హౌజింగ్ దశలో 60 శాతంకు పైగా నష్టపోయింది. దీంతో మిగిలిన హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లన్నీ సగటున పది శాతం పైగా నష్టపోయాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఛైర్మన్ కపిల్ వాద్వాన్ తమ కంపెనీలో ఎలాంటి సంక్షోభం లేదని మరో ఏడాది పాటు సరిపడా లిక్విడిటీ ఉందని చేసిన ప్రకటనతో షేరు కనీస స్థాయిల నుంచి కోలుకుంది. తమ కంపెనీ బాండ్లు లేదా మరే ఇతర డిఫాల్ట్ చేయలేదని ప్రకటించారు. అలాగే కంపెనీ ప్రమోటర్లు కూడా షేర్లను తనఖా పెట్టడం లేద షేర్ల మీద రుణాలను తీసుకోలేదని స్పష్టం చేశారు. చివరికి 44.8 శాతం నష్టంతో రూ. 337 వద్ద ముగిసింది. 


హౌసింగ్ ఫైనాన్స్ షేర్లపై పుకార్ల షికారు
ఇండియా బుల్స్ హౌజింగ్ 8.49 శాతం నష్టపోయింది. పీఎన్‌బీ హౌజింగ్ 4.92 శాతం, కెన్‌ఫిన్ హోమ్స్ 5.70 శాతం, ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ 5.05 శాతం నష్టాలతోముగిసాయి. అయితే లిక్విడిటీ కోసం డీహెచ్‌ఎఫ్‌ఎల్ రుణ పత్రాలను డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ అమ్మిందన్న వార్తలు మార్కెట్‌లో దావానంలా వ్యాపించాయి. మిగతా హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల్లోనూ లిక్విడిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ మార్కెట్లో పుకార్లు షికార్లు చేశాయి. 

click me!