Bosch to set up facility: హైద‌రాబాద్‌కు మ‌రో ప్ర‌ముఖ కంపెనీ.. 3 వేల మందికి అవ‌కాశాలు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 09, 2022, 11:57 AM IST
Bosch to set up facility: హైద‌రాబాద్‌కు మ‌రో ప్ర‌ముఖ కంపెనీ.. 3 వేల మందికి అవ‌కాశాలు

సారాంశం

తెలంగాణకు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ ఎంఎన్‎సీ కంపెనీ బాష్ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

తెలంగాణకు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ ఎంఎన్‎సీ కంపెనీ బాష్ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సాఫ్ట్‎వేర్ విభాగానికి సంబంధించి సుమారు మూడు వేల మందితో హైదరాబాద్‎లో ఒక క్యాంపస్‎ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‎లో మంత్రి కేటీఆర్ బాష్ కంపెనీని తెలంగాణకి ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో అద్భుతమైన మౌలిక వసతులతో పాటు మానవ వనరులు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కంపెనీ ప్రస్తుతం నిర్దేశించుకున్న మూడు వేల మంది ఉద్యోగుల సంఖ్యను త్వరలోనే మరింత విస్తరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన అనేక కంపెనీలు అత్యంత వేగంగా విస్తరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సమావేశానంతరం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కంపెనీ కార్యాలయ ఏర్పాటుకు సంబంధించిన వార్తను పంచుకున్నారు. జర్మనీకి చెందిన అత్యంత ప్రముఖ ఎంఎన్‎సీ కంపెనీ మరియు మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, హోమ్ అప్లయెన్సెస్ వంటి రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీ అయిన బాష్.. హైదరాబాద్‎లో తన గ్లోబల్ సాఫ్ట్‎వేర్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటు ద్వారా మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నట్లు కేటీఆర్ తెలిపారు. 

సరిగ్గా వంద సంవత్సరాల కింద భాష్ కంపెనీ భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడం యాదృచ్చికమని ఆయన అన్నారు. అలాగే 25 సంవత్సరాల కింద ఐటీ రంగంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ.. అనేక సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఇక్కడి వాతావరణ అనుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టడం గొప్ప విషయం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విధానాలను, ప్రగతిశీల పురోగతిని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల ఆకర్షణను తెలియజేస్తుందన్నారు. 

కంపెనీ త్వరలోనే అధికారికంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది. వివిధ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం, సాఫ్ట్‎వేర్ టెక్నాలజీ ఉపాధ్యక్షులు సెంటర్ హెడ్ సుందర రామన్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు మంత్రితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‏లో పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు