బైక్ మైలేజ్ రావడం లేదని అందరూ బాధ పడుతూ ఉంటారు. కాని మీకు తెలుసా? మీ బైక్ మంచి మైలేజ్ ఇవ్వడం మీ చేతుల్లోనే ఉంది. మీ బైక్ మంచి కండిషన్ లో ఉండాలంటే మీరు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
చాలా మంది కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే జీవితం అద్భుతంగా మారిపోవాలని చాలా మార్పులు చేయాలని అనుకుంటారు. అందులో ఒకటి బైక్ మెయింటనెన్స్. సర్వీసింగ్ చేయిద్దామనుకుంటారు మర్చిపోతారు. టైర్లలో గాలి పట్టిద్దామని అనుకుంటారు. టైమ్ లేదని వదిలేస్తారు. కాని బైక్ మాత్రం మంచి మైలేజ్ ఇవ్వాలని కోరుకుంటారు. మైలేజ్ కోసం మీ బైక్‌లో కొన్ని మార్పులు చేయడంతో పాటు మీరు కూడా కొన్ని పనులు టైమ్ కి చేస్తే బైక్ ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టకుండా రన్ అవుతుంది. అవేంటో చూద్దాం రండి.
మీ బైక్‌ని మంచి స్థితిలో ఉంచుకోవడానికి రెగ్యులర్ సర్వీసింగ్ చాలా ముఖ్యం. సంవత్సరాలు గడిచే కొద్దీ విడిభాగాలు అరిగిపోయి పనితీరు, మైలేజ్‌ని ప్రభావితం చేస్తాయి. అధికారిక సర్వీస్ సెంటర్లలో రెగ్యులర్ సర్వీసింగ్ చేయిస్తూ ఉండండి. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, చైన్, స్ప్రాకెట్, బ్రేక్ ప్యాడ్‌లను పూర్తిగా చెక్ చేయించుకోండి. సురక్షిత ప్రయాణం కోసం టైర్ ప్రెషర్, బ్రేక్‌లను ఎప్పటికప్పుడు గమనించండి.
ట్యూనింగ్ చేయడం వల్ల మీ బైక్ ఇంజిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల మైలేజ్ కూడా పెరుగుతుంది. మంచి బైక్ మెకానిక్ దగ్గర ఇంజిన్‌ని ట్యూన్ చేయించుకోండి. కార్బరేటర్‌ని శుభ్రం చేయించండి. బైక్ సేఫ్టీ, పనితీరులో టైర్లు కీలక పాత్ర పోషిస్తాయి. తప్పుడు ప్రెషర్ ఇచ్చినా, టైర్లు ఎక్కువ బరువు ఉన్నా ఆ ఎఫెక్ట్ ఇంధన సామర్థ్యంపై పడుతుంది. దీంతో మైలేజ్ తగ్గుతుంది.
చైన్, స్ప్రాకెట్ వ్యవస్థ బాగుంటే బైక్ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. ఇది అనవసరమైన ఇంధన వినియోగాన్ని నివారిస్తుంది. దుమ్ము, ధూళిని తొలగించడానికి చైన్‌ని తరచుగా శుభ్రం చేయండి. దెబ్బతిన్న చైన్లు లేదా స్ప్రాకెట్‌లను ఉంటే వెంటనే మార్చండి.
బ్రేక్ వ్యవస్థ భద్రతకు మాత్రమే కాదు.. పనిచేయని బ్రేక్ ఇంధన సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. బ్రేక్ ప్యాడ్‌లు, బ్రేక్ ఫ్లూయిడ్, బ్రేక్ లైన్లు అరిగిపోయినా, చిరిగిపోయినా ఇబ్బందే. తరచూ వీటిని చెక్ చేస్తూ అవసరమైతే మార్చేయండి. సరైన ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల ఇంజిన్ సజావుగా పనిచేస్తుంది. మంచి మైలేజ్ వస్తుంది. మీ బైక్ కంపెనీ సూచించిన ఇంధనాన్నే ఎల్లప్పుడూ వాడండి. వృధాను నివారించడానికి ఇంధన ట్యాంక్‌ని ఎక్కువగా నింపవద్దు.
ఎక్కువ బరువు మోసుకోవడం లేదా అన్ ఈవెన్ గా రైడ్ చేయడం వల్ల మైలేజ్ గణనీయంగా తగ్గుతుంది. మీ బైక్‌పై అనవసరమైన వస్తువులను ఓవర్‌లోడ్ చేయవద్దు. హఠాత్తుగా యాక్సిలరేట్ పెంచడం, బ్రేక్ వేయడం లాంటివి కూడా మైలేజ్ పై ప్రభావం చూపిస్తాయి. ఇంకోటి ఏంటంటే మీ బైక్ ఎంత శుభ్రంగా ఉంటే మీ బైక్ అంత బాగా పనిచేస్తుంది. దాని విడిభాగాలు ఎక్కువ కాలం మన్నుతాయి. దుమ్ము, ధూళిని తొలగించడానికి మీ బైక్‌ని తరచుగా కడగండి. చైన్, స్ప్రాకెట్‌లు, ఇతర ముఖ్యమైన భాగాలను శుభ్రం చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.
పెయింట్, విడిభాగాలు దెబ్బతినకుండా ఉండటానికి తగిన పదార్థాలను ఉపయోగించండి. పైన చెప్పిన చిట్కాలను పాటిస్తే మీ బైక్ మైలేజ్, పనితీరు మెరుగుపడతాయి. రెగ్యులర్ నిర్వహణ, జాగ్రత్తగా రైడ్ చేయడం, టైర్ ప్రెషర్, ఇంజిన్ ట్యూనింగ్ వంటి వివరాలపై దృష్టి పెడితే మీ బైక్ సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి