Jadavpur Student: గూగుల్, అమెజాన్ ఆఫర్లు.. కానీ ఫేస్‌బుక్‌లో కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం..!

By team teluguFirst Published Jun 28, 2022, 11:05 AM IST
Highlights

విద్యార్థులు ఇటీవల తమ చురుకుదనంతో, ప్రతిభతో మల్టినేషనల్ దిగ్గజాలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలను సంపాదిస్తున్నారు. తాజాగా జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థికి దాదాపు రెండు కోట్ల ప్యాకేజీతో ఫేస్‌బుక్ ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. కేవలం ఫేస్‌బుక్ మాత్రమే కాక ఈ విద్యార్థికి గూగుల్, అమెజాన్‌ల నుంచి కూడా ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి.
 

కోల్‌కతాలో జాదవ్‌పూర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి విశాఖ్ మోండల్‌ ఫేస్‌బుక్‌లో కళ్లు చెదిరే ప్యాకేజీతో ఉద్యోగం కొట్టాడు. రూ.1.8 కోట్ల వార్షిక ప్యాకేజీతో లండన్‌లో ఫేస్‌బుక్‌లో విశాఖ్‌కు ఉద్యోగం వచ్చింది. యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ నాలుగో ఏడాది చదువుతున్న విశాఖ్.. ఈ సెప్టెంబర్‌లో లండన్ వెళ్లనున్నాడు. విశాఖ్‌కు ఫేస్‌బుక్‌లో ఉద్యోగం రాకముందే.. గూగుల్, అమెజాన్ సంస్థల నుంచి కూడా జాబ్ ఆఫర్లు పొందాడు. కోవిడ్ కాలంలో సమయాన్ని దుర్వినియోగం చేయకుండా విశాఖ్ పలు సంస్థలలో ఇంటర్న్‌షిప్ అవకాశాలను దక్కించుకున్నట్టు తెలిపాడు. కేవలం పాఠ్య పుస్తకాల విజ్ఞానాన్ని కాకుండా.. కంపెనీలలో పనితీరుపై అనుభవం సంపాదించుకునేందుకు ఈ ఇంటర్న్‌షిప్‌లను ఎంచుకున్నట్టు విశాఖ్ తెలిపాడు. ఈ ఇంటర్న్‌షిప్‌లే తనకు ఇంటర్వ్యూలను క్రాక్ చేసేందుకు ఉపయోగపడ్డాయని పేర్కొన్నాడు.

బిర్భూమ్ జిల్లా రాంపూర్హాట్‌కు చెందిన విశాఖ్ మండల్.. సాధారణ కుటుంబానికి చెందిన వాడు. తల్లి శిభాని మోండల్ అంగన్‌వాడీ వర్కర్. చిన్నప్పటి నుంచి విశాఖ్ చాలా తెలివైన విద్యార్థి అని తల్లి శిభాని చెప్పారు. విశాఖ్‌కు ఫేస్‌బుక్‌లో ఉద్యోగం రావడం తమకు చాలా ఆనందంగా ఉందని, తమ కొడుకును ఉన్నత స్థాయిలో నిలిపేందుకు తాము చాలా కష్టపడ్డామని శిభాని తెలిపారు. చదువుల పట్ల విశాఖ్ ఎల్లప్పుడూ చాలా సీరియస్‌గా ఉండేవాడని, సెకండరీ ఎగ్జామ్స్ కూడా మంచి మార్క్స్ సంపాదించినట్టు చెప్పారు. మంచి ర్యాంకును సంపాదించి, జాదవ్‌పూర్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందినట్టు తెలిపారు.

విశాఖ్‌కు ఫేస్‌బుక్‌లో రూ.1.8 కోట్ల ప్యాకేజీ రావడంపై యూనివర్సిటీ ప్రొఫెసర్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఉద్యోగం రాకముందే విశాఖ్ మోండల్‌కి గూగుల్, అమెజాన్‌ల నుంచి కూడా ఉద్యోగ ఆఫర్ వచ్చింది. కానీ విశాఖ్ ఫేస్‌బుక్‌లో చేరేందుకు మొగ్గు చూపాడు. అమెజాన్, గూగుల్‌తో పోలిస్తే అత్యధిక ప్యాకేజీని ఫేస్‌బుక్ విశాఖ్‌కు ఆఫర్ చేస్తుంది.

click me!