బీ అలర్ట్: 2 బ్యాంకు సమ్మెలు.. 3 రోజుల సెలవులు

By rajesh yFirst Published Dec 20, 2018, 10:50 AM IST
Highlights

శుక్రవారం నుంచి వచ్చే బుధవారం వరకు ఐదు రోజులు బ్యాంకులు పని చేయవు. శుక్రవారం, మంగళవారం బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయనుండగా, మరో మూడు రోజులు సెలవులు. సోమవారం ఒక్కరోజు మాత్రమే సేవలందిస్తాయి.

ముంబై : మీకు జాతీయ బ్యాంకుల్లో ఖాతా ఉందా? అయితే ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు బ్యాంకులు ఐదు రోజులు పనిచేయవు. ఇందులో బ్యాంకులను విలీనం చేయడాన్ని నిరసిస్తూ 21, 26 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయనున్నారు. 24 నుంచి 25వ తేదీ వరకు సెలవులు.. కనుక  సంవత్సరాంతంలో బ్యాంకు పనులుంటే వెంటనే పూర్తి చేసుకోండని సూచిస్తున్నారు బ్యాంకింగ్ నిపుణులు. ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్సిడరేషన్ పిలుపు మేరకు శుక్రవారం బ్యాంకు ఆఫీసర్లు సమ్మె చేయనుండటంతో బ్యాంకులు పనిచేయవు. 3.2 లక్షల మంది బ్యాంకు అధికారులు సమ్మెలో పాల్గొననున్నారు. డిసెంబర్ 22వతేదీన నాల్గవ శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు. 

25న క్రిస్మస్ సందర్భంగా బ్యాంకుల సమ్మె
డిసెంబర్  25వతేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 24వతేదీన బ్యాంకు తెరచి ఉంచినా, వరుస సెలవులు రావడంతో ఎక్కువ మంది ఉద్యోగులు సెలవులో ఉండటం వల్ల లావాదేవీలు సజావుగా జరగవు. తిరిగి ఈ నెల 26వతేదీ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు పిలుపు ఇచ్చినందున బ్యాంకులు ఆ రోజు కూడ పనిచేయవు. 

ఏటీఎంల్లో నగదు నింపనున్న బ్యాంకులు 
అందుకే సంవత్సరాంతంలో ఖాతాదారులు బ్యాంకులకు సెలవులతో ఇబ్బందులు పడకుండా ముందే లావాదేవీలు పూర్తి చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. బ్యాంకులకు వరుస సెలవులతో నగదు కొరత ఏర్పడకుండా ఏటీఎంలలో నగదును నింపాలని బ్యాంకులు నిర్ణయించాయి.

సమస్యల పరిష్కారానికి శుక్రవారం బ్యాంకు అధికారుల సమ్మె 
ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ వ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేపట్టనున్నట్టు ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారుల సమాఖ్య ప్రకటించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ సమ్మె చేపడుతున్నట్టు సమాఖ్య నేత సూర్యకుమార్‌ స్పష్టంచేశారు. ఉద్యోగుల జీతాల సవరణ బ్యాంకుల లాభ, నష్టాలపై చేయడం దారుణమన్నారు. పింఛనర్లకు పింఛన్లు కూడా సవరించాలని డిమాండ్‌ చేశారు. 30 ఏళ్ల క్రితం ఇస్తున్నట్టే ఇప్పుడూ అమలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 21న తాము చేపట్టిన సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలని సూర్యకుమార్‌ విజ్ఞప్తి చేశారు.

విలీనానికి వ్యతిరేకంగా 26న సమ్మె: వెంకటాచలం
దేశ వ్యాప్తంగా బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 26న తొమ్మిది బ్యాంకు యూనియన్లు సమ్మెకు దిగుతున్నట్టు బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎన్నో శాఖలు మూతపడి ఉద్యోగులు రోడ్డున పడ్డారని చెప్పారు. సమ్మెలో 10లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర వైఖరిలో మార్పు రాకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని స్పష్టంచేశారు.  ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల 8, 9 తేదీల్లో మరోసారి సమ్మెకు దిగుతామని వెంకటాచలం హెచ్చరించారు. 
 

click me!