అరబిందోకు షాక్: అమెరికా కంపెనీ ‘పేటెంట్’ దావా

By rajesh yFirst Published May 20, 2019, 11:44 AM IST
Highlights


హైదరాబాద్ కేంద్రంగా ఔషధాలు ఉత్పత్తి చేస్తున్న ‘అరబిందో ఫార్మా’ సంస్థకు అమెరికాలో ఎదురు దెబ్బ తగిలింది. పేటెంట్‌ ఉల్లంఘనలకు పాల్పడిందన్న ఆరోపణలతో
న్యూజెర్సీ డిస్ట్రిక్ట్‌ కోర్టులో అమెరికా ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా పిటిషన్‌ దాఖలు చేసింది. 

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అరబిందో ఫార్మాకు అమెరికాలో ఎదురు దెబ్బ తగిలింది. అరబిందోపై అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఫార్మాసూటికల్స్‌.. ఆ దేశంలోని జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసింది. 

జెనరిక్‌ వెర్షన్‌ దలిరెస్ప్‌ (రోఫ్లుమిలాస్ట్‌ టాబ్లెట్‌ 500 ఎంసీజీ) ఔషధం విషయమై అరబిందో.. పేటెంట్‌ ఉల్లంఘనలకు పాల్పడిందంటూ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఈ నెల 15న న్యూజెర్సీ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఆస్ట్రాజెనెకా పిటిషన్‌ వేసింది. 

దలిరెస్ప్‌ జెనరిక్‌ ఔషధం విషయంలో మూడు కౌంట్లలో అరబిందో ఫార్మా పేటెంట్ల ఉల్లంఘనలకు పాల్పడిందని ఆ పిటిషన్ లో పేర్కొంది. ఈ ఔషధాన్ని ఉత్పత్తి, దిగుమతి చేయకుండా చూడాలని కోరింది.

అంతే కాదు అమెరికాలో ఈ ఔషధ విక్రయాలను అరబిందో వెంటనే నిలిపివేసేలా ఇంజక్షన్‌ ఉత్తర్వులు జారీ చేయాలని డిస్ట్రిక్ట్‌ కోర్టును ఆస్ట్రా జెనెకా కోరింది. దలిరెస్ప్‌ ఔషధాన్ని పెద్దల్లో వచ్చే ప్రాణాంతక ఆబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ (ఊపిరితిత్తుల) డిసీజ్‌ (సీఓపీడీ) చికిత్సలో ఉపయోగిస్తారు. 

ఈ ఔషధానికి సంబంధించి 206, 064, 143 పేటెంట్‌ నిబంధనలను ఆరబిందో ఫార్మా ఉల్లంఘించిందని కోర్టుకు పేర్కొంది. అంతేకాకుండా అరబిందో ఫార్మా ఈ ఔషధాన్ని ఉత్పత్తి, విక్రయించకుండా శాశ్వత ఇంజక్షన్‌ ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. అయితే అమెరికా జెనెరిక్ ఔషధాల మార్కెట్లో ఇటువంటి కేసులు సాధారణమేనని ఓ ఫార్మా సంస్థ సీనియర్ అధికారి పేర్కొన్నారు. అరబిందో సంస్థ కార్యకలాపాలపై దీని ప్రభావమే ఉండబోదని పేర్కొన్నారు.

‘దలిరెస్ప్‌ (రోఫ్లుమిలాస్ట్‌ టాబ్లెట్‌ 500 ఎంసీజీ)’ఔషధంపై పేటెంట్ కోసం తమ దరఖాస్తును 2011 ఫిబ్రవరి 28న అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్‌డీఏ) ఆమోదించిందని ఆస్ట్రాజెనెకా ఫార్మా పేర్కొంది. తాము దలిరెన్స్ ఔషధంపై ‘అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్’ను యూఎస్ఎఫ్‌డీఏకు సమర్పించామని ఆస్ట్రాజెనెకాకు 2019 ఏప్రిల్ ఐదో తేదీన అరబిందో ఫార్మా లేఖ రాసింది. 

click me!