నేను నిర్దోషిని.. క్విడ్‍ప్రోకు నో చాన్స్.. ఈడీతో చందాకొచ్చర్

By telugu teamFirst Published May 19, 2019, 4:04 PM IST
Highlights

వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు విషయంలో తాను నిర్దోషినని, క్విడ్‌ప్రోకోకు ఆస్కారమే లేదని ఐసీఐసీఐ మాజీ ఎండీ కమ్ సీఈఓ చందాకొచ్చర్ పేర్కొన్నారు. రుణాల మంజూరుకు చాలా ప్రక్రియ ఉంటుందని విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో ఆమె అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

‘నేను నిర్దోషిని.. ఏ తప్పూ చేయలేదు’ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల విచారణలో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్‌ మాటలివి. వీడియోకాన్‌ గ్రూప్‌కు రుణాల మంజూరులో అవకతవకల కేసుపై దాదాపు వారం రోజులు (సోమవారం నుంచి)గా చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్లను ఈడీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎలాంటి అక్రమాలు జరుగలేదని కొచ్చర్‌ దంపతులు చెప్పినట్లు ఈడీ అధికారుల ద్వారా తెలుస్తున్నది. వీడియోకాన్‌ గ్రూప్‌ సంస్థ నుంచి 2009 సెప్టెంబర్‌లో తన నూపవర్‌ రెన్యువబుల్స్‌ లిమిటెడ్‌కు బదిలీ అయిన రూ.64 కోట్లకు అక్రమ లావాదేవీలకు సంబంధం ఉందన్న ఆరోపణల్ని దీపక్‌ కొచ్చర్‌ ఖండించారని ఈడీ వర్గాల సమాచారం. ఇక ఈ లావాదేవీ పూర్తి సక్రమమని దీపక్‌ కొచ్చర్ అన్నారు. 

వీడియోకాన్‌ గ్రూప్‌కు ఇచ్చిన రుణాలను తానొక్కరే మంజూరు చేయలేదని.. నిపుణులు, ప్రముఖ బ్యాంకర్లతో కూడిన క్రెడిట్‌ కమిటీలు నిర్ణయం తీసుకున్నాయని చందా కొచ్చర్‌ వివరించినట్లు ఓ ఈడీ అధికారి అన్నారు. అలాంటి రెండు కమిటీల్లో తాను సభ్యురాలిని మాత్రమేనని ఆమె చెప్పినట్లు స్పష్టం చేశారు.

రుణాల మంజూరుకు పెద్ద యంత్రాంగమే పనిచేస్తుందని, ఇందులో ఏ ఒక్కరి జోక్యం ఉండబోదని కూడా చందా కొచ్చర్ చెప్పారని తెలుస్తోంది. తన భర్త వ్యాపార లావాదేవీలు తనకు పూర్తిగా తెలియదని ఆమె వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన ఈ కేసులో భాగంగా అధికారులు సోదాలు నిర్వహించినప్పటి నుంచి కొచ్చర్లు విచారణకు హాజరవుతున్నారు. దీపక్‌ కొచ్చర్‌ సోదరుడు రాజీవ్‌ కొచ్చర్‌నూ ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సీబీఐ కూడా రాజీవ్‌ను ప్రశ్నిస్తున్నది. 

రాజీవ్‌ కొచ్చర్‌.. సింగపూర్‌ ఆధారిత అవిస్తా అడ్వైజరీ సంస్థ వ్యవస్థాపకుడు. వీడియోకాన్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణలో ఈ సంస్థ ప్రమేయం ఏమైనా ఉందా? అన్నదానిపై సీబీఐ ఆరా తీస్తున్నది. ఇక మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద వీరందరి వాంగ్మూలాల్ని అధికారులు రికార్డు చేస్తున్నారు. 

వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిన రూ.1,875 కోట్ల రుణం మంజూరులో అక్రమాలు జరిగాయన్న దానిపై ఈడీ క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేసింది. చందా కొచ్చర్‌ తన అధికారాన్ని ఉపయోగించి వీడియోకాన్‌కు రుణాలిచ్చారని, ఇందుకు బదులుగా నూపవర్‌లో సుప్రీం ఎనర్జీ ద్వారా వీడియోకాన్‌ గ్రూప్‌ అధినేత ధూత్‌ పెట్టుబడులు పెట్టారని, ఆ తర్వాత వాటిని వదులుకున్నారన్న ఆరోపణలున్నాయి.

వీడియో కాన్ సంస్థకు రుణాల మంజూరు కేసులో కేసు నేపథ్యంలో చందాకొచ్చర్‌ ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ కం సీఈఓగా వైదొలిగారు. 2009 మే 1న బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా ఆమె బాధ్యతలు చేపట్టారు. 

2009 జూన్‌ నుంచి 2011 అక్టోబర్‌దాకా వీడియోకాన్‌ గ్రూప్‌లోని ఐదు సంస్థలకు ఆరు భారీ స్థాయి రుణాలు మంజూరయ్యాయి. 2009 సెప్టెంబర్‌లో రూ.300 కోట్లు మంజూరైన మరుసటి రోజే నూపవర్‌లోకి రూ.64 కోట్ల పెట్టుబడులు వెళ్లాయని సీబీఐ వాదిస్తున్నది. ఇది క్విడ్‌ప్రోకోనేనని అంటున్నది.


 

click me!