Annual Global CEO Survey: ఈ ఏడాదిలో భారత వృద్ధి రేటు సూపర్: గ్లోబల్ సీఈవో సర్వే

By team teluguFirst Published Jan 19, 2022, 1:57 PM IST
Highlights

కరోనా సంబంధిత ఆందోళన, అంతర్జాతీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధి వచ్చే 12 నెలల కాలంలో పుంజుకుంటుందని PwC యాన్యువల్ గ్లోబల్ సీఈవో సర్వేలో వెల్లడైంది. 89 దేశాలు, ప్రాంతాలకు చెందిన 4,446 సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

కరోనా సంబంధిత ఆందోళన, అంతర్జాతీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధి వచ్చే 12 నెలల కాలంలో పుంజుకుంటుందని PwC యాన్యువల్ గ్లోబల్ సీఈవో సర్వేలో వెల్లడైంది. 89 దేశాలు, ప్రాంతాలకు చెందిన 4,446 సీఈవోలు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో 77 మంది భారత్ నుండి ఉన్నారు. ఈ సర్వే అక్టోబర్ 2021 నుండి నవంబర్ 2021 మధ్య చేశారు. ఈ అంతర్జాతీయ కన్సల్టెన్సీ ఈ సర్వేకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

వివిధ ప్రతికూలతలు, ముఖ్యంగా కరోనా సంబంధిత ఆందోళన ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది నాటికి పుంజుకుంటుందని వెల్లడైంది. 'సర్వేలో పాల్గొన్న 99% మంది 12 నెలల కాలంలో ఆర్థికవృద్ధి పెరుగుతుందని వెల్లడించారు. 94% మంది ఇండియా సీఈవోలు ప్రపంచ ఆర్థిక వృద్ధి వచ్చే పన్నెండు నెలల కాలంలో ఆశాజనకంగా ఉంటుందని వెల్లడించారు. అదే సమయంలో 77 శాతం మంది ప్రపంచ సీఈవోలు మాత్రమే ఆశాజనకంగా ఉన్నారు.' అని పేర్కొంది. ఆదాయపరమైన అంశం విషయానికి వస్తే 98 శాతం మంది సీఈవోలు వృద్ధి పైన ఆశాజనకంగా ఉన్నారు. 2021 కంటే 2022 మరింత వృద్ధి నమోదవుతుందని ఎక్కువమంది వెల్లడించారు. భారత సీఈవోల్లో గత ఏడాది 88 శాతం ఆశాజనకంగా ఉండగా, ఇప్పుడు 94 శాతం మంది ఉన్నారు.

తమ కంపెనీల ఆదాయం వృద్ధి నమోదు చేస్తుందని 98 శాతం మంది సీఈవోలు తెలిపారు. స్వల్పకాలానికే కాకుండా వచ్చే మూడేళ్లలో కంపెనీల ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని 97 శాతం మంది భారతీయ సీఈవోలు తెలిపారు. 2021లో 70 శాతం మంది భారతీయ సీఈవోలు వృద్ధికి కోవిడ్ విఘాతం కలిగిస్తుందని తెలపగా, 62 శాతం మంది సైబర్ దాడులు వృద్ధికి ఆటంకమన్నారు. ఆదాయాలపై సైబర్ దాడుల ప్రభావం ఉంటుందని, తమ ఉత్పత్తులు, సేవల విక్రయాలపై ప్రభావం చూపుతాయని 64 శాతం మంది సీఈవోలు తెలిపారు. జీరో కార్బన్ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు 27 శాతం మంది భారతీయ సీఈవోలు తెలపగా, అంతర్జాతీయంగా 22 శాతం మంది మాత్రమే చెప్పారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సీఈవోలు తమ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా పరిణామాలు సృష్టించిన అవరోధాల నుండి బయటపడేలా, మరింత వృద్ధి సాధించేలా కార్యాచరణలో ఉన్నట్లు తెలిపారు.

click me!