కార్టూన్ సాకుగా ‘భారత్’పై ట్విట్టర్ వివక్ష.. అమూల్ రిక్వెస్ట్ తర్వాత రీస్టోర్

By narsimha lodeFirst Published Jun 7, 2020, 1:41 PM IST
Highlights

భారతదేశంలోనే అతిపెద్ద డెయిరీ కంపెనీ అమూల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేయడం వివాదంగా మారింది. 

ముంబై: భారతదేశంలోనే అతిపెద్ద డెయిరీ కంపెనీ అమూల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్‌లోని పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేయడం వివాదంగా మారింది. చైనా వస్తువులను బాయ్‌కౌట్ చేయడాన్ని సమర్ధిస్తూ ఒక పోస్ట్ చేసిన కొద్ది గంటలకే అమూల్ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా ట్విట్టర్ ఇండియా డీయాక్టివేట్ చేసింది.

‘చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి’ అనే అర్థంతో ఒక కార్టూన్‌ను అమూల్‌ ట్వీట్‌ చేసింది. ఆ వెంటనే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అమూల్ ఖాతాను ట్విటర్‌ బ్లాక్‌ చేయడం విమర్శలకు తావిచ్చింది. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీసింది.

అమూల్‌ సంస్థ ప్రతి రోజూ చేసినట్లే గురువారం రాత్రి ‘డ్రాగన్‌ నుంచి బయటపడండి?’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘స్వావలంబన భారత్‌’కు మద్దతుగా కార్టూన్‌ను ప్రదర్శించింది. అందులో ‘అమూల్‌.. మేడిన్‌ ఇండియా’ అనీ ఉంది. దీనిని పోస్ట్‌ చేశాక ట్విటర్‌ తమ ఖాతాను నిలిపివేసిందని జీసీఎంఎంఎఫ్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి అన్నారు.

‘మా ట్విటర్‌ ఖాతాను ఎందుకు బ్లాక్‌ చేశారో తెలియదు. ట్విటర్‌ నుంచి మాకు ఎలాంటి అధికారిక నోటీసు రాలేదు. ఎవరికీ వ్యతిరేకంగా అమూల్‌ ప్రచారం చేయదు. 55 ఏళ్లుగా మేం కార్టూన్లు ప్రచురిస్తున్నాం. సాధారణ అంశాలు, ప్రస్తుతం ప్రజల భావోద్వేగాలను అనుసరించి హాస్య ధోరణిలో వీటిని ఇస్తుంటాం’ అని జీసీఎంఎంఎఫ్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి చెప్పారు.

‘ఈ నెల 4వ తేదీ రాత్రి యాడ్‌ ఏజెన్సీ ఈ కార్టూన్‌ను పోస్ట్‌ చేశాక ట్విట్టర్ ఖాతా నిలిపివేశారని తెలిసింది. రీ యాక్టివేషన్‌ చేయాలని కోరాక పునరుద్ధరించారు. ఎందుకు బ్లాక్‌ చేశారో చెప్పాలని అడగ్గా అధికారికంగా ఏమీ చెప్పలేదు’ అని జీసీఎంఎంఎఫ్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోధి శనివారం మీడియాకు చెప్పారు. 

also read:పసిడిపై పెట్టుబడులు పలు రకాలు.. రేపటి నుంచి బాండ్ల స్వీకరణ

'అమూల్ అకౌంట్ డీయాక్టివేషన్‌కు కారణంపై మైక్రో బ్లాగింగ్ సైట్‌ ట్విట్టర్‌ను కంపెనీ సంప్రదించింది. జూన్ 4న మా అకౌంట్‌ను బ్లాక్ చేశారు. మా శ్రేయాభిలాషుల ద్వారా ఆ విషయం మా దృష్టికి వచ్చింది. కొన్ని ప్రోటాకాల్స్ అనంతరం తిరిగి మా ఖాతను పునరుద్ధరించారు' అని సోధి చెప్పారు

ఈ విషయం బయటకు వచ్చాక అమూల్‌కు మద్దతుగా నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్లు చేశారు. ట్విటర్‌ తీరును ఎండగట్టారు. భారత్‌ పట్ల ట్విటర్‌ వివక్షాపూరితంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. దీనిపై సోథి మరో ట్వీట్‌లో వివరణ ఇస్తూ, సాంకేతిక కారణాల వల్లే అకౌంట్‌ బ్లాక్ చేశామని, పోస్ట్ చేసిన అంశం ఇందుకు కారణం కాదని ట్విట్టర్ ఇండియా ఎండీ తనకు వివరణ ఇచ్చినట్టు తెలిపారు. 

click me!