భేటీకి అమెజాన్ డుమ్మా: పార్లమెంట్ కమిటీ సీరియస్.. చర్యలు తప్పవంటూ వార్నింగ్

By Siva KodatiFirst Published Oct 23, 2020, 6:35 PM IST
Highlights

వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు 2019పై చర్చించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) ముందు హాజరయ్యేందుకు అమెరికన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నిరాకరించింది

వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు 2019పై చర్చించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) ముందు హాజరయ్యేందుకు అమెరికన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నిరాకరించింది.

సంబంధిత అంశంపై చర్చించే నిపుణులు విదేశాల్లో ఉన్నారని.. కరోనా నేపథ్యంలో ప్రయాణం చేయడం అంత సురక్షితం కాదని అమెజాన్... కమిటీకి తెలియజేసినట్లుగా తెలుస్తోంది.

దీనిని తీవ్రంగా పరిగణించిన ప్యానెల్ ఛైర్మన్, బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి అమెజాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించారు.

అక్టోబర్ 28న కంపెనీ తరపున ఏ ఒక్కరూ సమావేశానికి హాజరుకాకపోతే ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని లేఖి హెచ్చరించారు.

మైక్రోబ్లాగ్‌ సైట్లు గూగుల్‌, పేటీఎంతో పాటు అమెజాన్‌ కూడా ప్యాన‌ల్ ముందు హాజ‌రుకావాలంటూ పార్ల‌మెంట‌రీ క‌మిటీ ఇటీవ‌ల ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఫేస్‌బుక్ తరపున అంకిదాస్ శుక్రవారం ప్యానెల్ ముందు హాజరయ్యారు.

ప్యాన‌ల్ స‌భ్యులు అంఖిని ప‌లు భ‌ద్ర‌తా అంశాల‌పై ప్ర‌శ్న‌లు వేశారు. గూగుల్‌, పేటీఎం సంస్థ‌లు అక్టోబ‌ర్ 29వ తేదీన ప్యాన‌ల్ ముందు హాజ‌రుకానున్నాయి.

పార్లమెంట్‌లో విపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ బిల్లును కేంద్రం జేపీసీకి పంపింది. దీంతో గూగుల్, ట్విట్టర్, ఫేస్‌బుక్, అమెజాన్, పేటీఎం వంటి సంస్థలకు ఈ కమిటీ తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. 

click me!