
ప్రధాని మోడీ ఒత్తిడితోనే శ్రీలంకకు చెందిన పవర్ ప్రాజెక్ట్ అదానీ సంస్థకు దక్కిందన్న వార్తలపై అదానీ గ్రూప్ స్పందించింది. ఆ వార్త తమను నిరాశకు గురిచేసిందని అదానీ గ్రూప్ పేర్కొంది. శ్రీలంకలో పెట్టుబడులు పెట్టడం వెనుక ఉద్దేశం పొరుగుదేశానికి సాయం అందించడమేనని పేర్కొంది. బాధ్యతాయుతమైన కార్పోరేట్ సంస్థగా ఇరు దేశాల భాగస్వామ్యంలో ఇది అవసరమైన విధిగా తాము భావించామని తెలిపింది. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలపై తాము కలత చెందుతున్నామని, ఈ సమస్య శ్రీలంకలో పరిష్కారమైందని అదానీ గ్రూప్ ప్రతినిధి వెల్లడించారు. మోడీ ఒత్తిడి మేరకే శ్రీలంక అధ్యక్షుడు మన్నార్ జిల్లాలోని 500 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును అదానీ గ్రూప్‌కు అప్పగించారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మోడీ ఒత్తిడితోనే గొటబయ రాజపక్సే ఈ పని చేశారని శ్రీలంక సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (సిఇబి) చైర్మన్ ఎంఎంసి ఫెర్డినాండో గతంలో వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తనకు రాజపక్సే చెప్పారంటూ పార్లమెంట్ ప్యానల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కమిటీ (సిఒపిఇ) బహిరంగ విచారణలో పేర్కొన్నారు. శుక్రవారం ఈ ఆరోపణలు చేయగా.. తాజాగా ఈ వ్యాఖ్యలను ఫెర్డినాండో ఉపసంహరించుకున్నారు. ఆదివారం ట్విట్టర్‌లో ఈ ఆరోపణలు రాజపక్సే ఖండించిన తర్వాత.. ఈ వ్యాఖ్యలను ఫెర్డినాండో తక్షణమే వెనక్కు తీసుకున్నారు. బహిరంగ క్షమాపణలు చెపుతూ సోమవారం ఫెర్డినాండో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
శ్రీలంకలో సంప్రదాయేతర ఇంధన వనరుల మౌలిక వసతుల ప్రాజెక్టులపై కుదిరిన ఒప్పందాలపై ఆ దేశ పార్లమెంటులోని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ కమిటీ విచారణ జరుపుతున్నది. ఈ కమిటీ ముందు ఫెర్డినాండో శుక్రవారం హాజరై కమిటీ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మన్నార్ ప్లాంటు గురించి అడగకూడనిది ఏమైనా ఉన్నదా? అని కమిటీ చైర్మన్ చరిత హెరాత్ ప్రశ్నించగా.. ‘అవును.. ఇది రెండు ప్రభుత్వాల మధ్య నేరుగా కుదిరిన డీల్. 2021 నవంబర్ 24న గొటబయ రాజపక్స నన్ను పిలిపించారు. మన్నార్ విండ్ పవర్ ప్లాంటును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు ఇవ్వాలని భారత ప్రధాని నాపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు’ అని కుండబద్ధలు కొట్టారు.
ఫెర్డినాండో ఇచ్చిన వాంగ్మూలం వీడియోను శ్రీలంక టీవీ చానల్ న్యూస్ ఫస్ట్ ప్రసారం చేయటంతో కలకలం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. శనివారం రాత్రి అధ్యక్షుడు గొటబయ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పార్లమెంటరీ కమిటీ ముందు చెప్పిన మాటలను ఫెర్డినాండో ఉపసంహరించుకొన్నారు. మన్నార్ విండ్ పవర్ ప్లాంటును ఏ వ్యక్తికిగానీ, ఏ సంస్థకుగానీ ఇవ్వాలని నేను సిఫారసు చేయలేదు’ అని ప్రకటించారు.
అదానీ గ్రూప్‌నకు విండ్ పవర్ ప్లాంటు పోటీ లేకుండా ఇవ్వాలని సిఫారసు చేయలేదని ఒకవైపు చెప్తూనే, మరోవైపు గొటబయ ప్రభుత్వం అదానీకి మేలు చేసేలా చట్ట సవరణ చేయటం ఇప్పుడు మరింత అగ్గి రాజేసింది. విండ్, సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణ కాంట్రాక్టులను ఎలాంటి పోటీ లేకుండా ఎంపికచేసిన సంస్థలకు అప్పగించేలా 1989 నాటి ఎలక్ట్రిసిటీ చట్టానికి ప్రతిపాదించిన సవరణకు లంక పార్లమెంటు గురువారం ఆమోదం తెలిపింది. దీంతో అదానీ గ్రూప్‌నకు మన్నార్ ప్లాంటు అప్పగింత ఒప్పందం చట్టబద్ధంగా మారిపోయింది. ఈ చట్ట సవరణపై ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవెగయ (ఎస్‌జేబీ) తీవ్రంగా మండిపడింది. అదానీ గ్రూప్‌తో ఒప్పందాన్ని ప్రశ్నించకూడదనే ఈ చట్ట సవరణ చేశారని మండిపడింది.
గత ఏడాది అక్టోబరులో అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ శ్రీలంకలో పర్యటించారు. గోటబయ రాజపక్సతో పెట్టుబడులపై చర్చించారు. మన్నార్, జాఫ్నా, కిలినోచీ లాంటి తీర ప్రాంతాల్లో గౌతమ్ అదానీ పర్యటించారు. మన్నార్, కిలినోచీలలోని రెండు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులపై శ్రీలంక ప్రభుత్వం, అదానీ గ్రూపు ఒక ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. మార్చి 12న ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే, దీని వివరాలు బయటకు వెల్లడించలేదు. శ్రీలంకకు భారత్ ఆర్థిక సాయం అందిస్తున్న సమయంలోనే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీంతో ఈ ఒప్పందంలో పారదర్శకత కరవైందని శ్రీలంకలో విమర్శలు వచ్చాయి.