
LIC స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పటి నుంచి భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) పతనమవుతూనే ఉంది. గత నెల 17న స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పటి నుంచి సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.32 లక్షల కోట్లు నష్టపోయింది. ఎల్ఐసీ షేర్ సోమవారం ఆల్‌టైం కనిష్ట స్థాయి రూ.666.90కి పడిపోయింది. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.54 లక్షల కోట్ల నుంచి రూ.4.23 లక్షల కోట్లకు పడిపోయింది. బ్లూంబర్గ్ అధ్యయన నివేదిక ప్రకారం ఆసియా మార్కెట్లలో ఐపీవో ద్వారా లిస్టయిన తర్వాత భారీగా 17 బిలియన్ల డాలర్ల సంపద కోల్పోయిన సంస్థగా ఎల్ఐసీ నిలిచింది.
సోమవారం వరుసగా పదో రోజు ఎల్ఐసీ షేర్ పతనమైంది. దాదాపు ఆరు శాతం నష్టపోయింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో ఎల్ఐసీ షేర్ 5.85 శాతం నష్టపోయి రూ.668.20 వద్ద నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఆరు శాతం వరకు నష్టపోయి రూ.666.90 వరకు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో 5.66 శాతం నష్టంతో రూ.669.50 వద్ద ముగిసింది. గత పది రోజుల్లో ఎల్ఐసీ షేర్లు 20.17 శాతం నష్టపోయాయి.
గత నెల 17న స్టాక్ మార్కెట్లలో ఎల్ఐసీ లిస్టయింది. ఐపీవో ద్వారా లిస్టింగ్‌కు ఎల్ఐసీ షేర్ విలువ రూ.949గా ఖరారు చేసింది. ఎల్ఐసీ ఐపీవోలో సంస్థ దాదాపు మూడు రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రూ.949గా షేర్ విలువ ఖరారైనప్పటి నుంచి 29.58 శాతం నష్టపోయింది. బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఎల్ఐసీ ఏడో స్థానంలో ఉంది. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,22,636.35 కోట్లకు చేరుకున్నది.
ఎల్ఐసీ షేర్లు మరింత క్షీణించే అవకాశాలు లేకపోలేదు. పేలవ త్రైమాసిక ఫలితాలు వస్తే మరింత పతనం ఖాయమని డిస్కౌంట్ బ్రోకరేజీ ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ ప్రైవేటు లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ అవినాష్ గోరక్షకర్ విశ్లేషించారు. ఇన్వెస్టర్లతో మేనేజ్‌మెంట్ మాట్లాడుతున్న తీరు గందరగోళంగా ఉందన్నారు. త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఎనలిస్ట్ కాల్‌ను నిర్వహించలేదని చెప్పారు. కాబట్టి కంపెనీ షేర్ల వృద్ధి విషయంలో యాజమాన్యానికి స్పష్టతలేదు. వ్యూహం ఏమిటో కూడా తెలియడంలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఎల్ఐసీ షేర్ల విషయంలో ఎలాంటి కంగారూ అక్కర్లేదని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఎల్ఐసీ యాజమాన్యం అన్నీ అంశాలనూ పరిగణలోకి తీసుకుంటుందని, షేర్ హోల్డర్ల వ్యాల్యూ పెంపునకు కృషి చేస్తామని అధికారులు చెబుతున్నారు.