ఇండస్ట్రీ, సర్కార్ కలిసి ముందుకెళ్లాలి.. విద్యుత్ వెహికల్స్‌పై టాటా సన్స్‌

By rajesh yFirst Published Jun 27, 2019, 10:27 AM IST
Highlights


దేశీయ వాహన రంగాన్ని విద్యుత్ వినియోగం వైపు మళ్లించేందుకు దీర్ఘ కాలిక ప్రణాళిక అవసరమని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇండస్ట్రీ, సర్కార్ కలిసి ముందుకు వెళితే సత్ఫలితాలు వస్తాయన్నారు.

 

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాల (ఈవీ)కు మారడానికి మొత్తం వ్యవస్థ సంసిద్ధంగా ఉండేలా దీర్ఘ కాలిక ప్రణాళిక అవసరమని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. అందు కోసం బహుళ వార్షిక ప్రణాళిక అవసరమని అన్నారు. 2025 కల్లా అన్ని ద్విచక్ర వాహనాలు (150 సీసీ లోపు సామర్థం గలవి), త్రిచక్ర వాహనాలు విద్యుత్‌తో నడిచేవే ఉత్పత్తి చేయాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనను హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌, హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. ఇంటర్నల్ కంబుస్టర్ ఇంజిన్లను నిషేధించాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. 

‘ప్రభుత్వం, పరిశ్రమ కలిసి బహుళ వార్షిక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. సామర్థ్యాలను, మౌలిక వసతులకు సహకరించుకోవాలి. అపుడే అవరోధాలను తగ్గించుకోవడానికి వీలవుతుంది’అని చంద్రశేఖరన్‌ చెప్పారు. విద్యుత్ వాహనాల ఉత్పత్తి దిశగా మళ్లే సంస్థలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని సూచించారు. దీంతోపాటు యావత్ వ్యవస్థను సిద్ధం చేయాల్సి ఉంటుందని చెప్పారు. బహుళ సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికతోపాటు మైలురాళ్లను సాధిస్తూ ముందుకు సాగాలన్నారు. విద్యుత్ వినియోగ ఫోర్ వీలర్స్‌లో టాటా మోటార్స్ పట్టు సాధించింది. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాతో పోటీ పడి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి టాటా మోటార్స్ ఆర్డర్లు సంపాదిస్తోంది. 

మారుతీ సుజుకీ కూడా ఈవీలకు మారడం అనేది దీర్ఘకాల అంశం. స్వల్ప, మధ్యకాలంలో సీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలకు మద్దతు అందించాలని అభిప్రాయపడింది. మెర్సిడెజ్ బెంజ్, టయోటా, హోండా కార్స్ యాజమాన్యాలు సైతం విద్యుత్ వాహనాల ఉత్పత్తిపై దీర్ఘకాలిక ద్రుక్పథంతో కూడిన విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరాయి. సంప్రదాయ వాహనాల నుంచి విద్యుత్ వాహనాలకు మారేందుకు మద్దతుగా నిలువాలని అభ్యర్థించాయి. 

click me!