విస్తరణ వ్యూహం: బ్రాడ్ బాండ్, ఈ-కామర్స్‌ టార్గెట్.. విదేశీ బ్యాంకులతో రిలయన్స్‌ రుణ బందం

By rajesh yFirst Published Jun 26, 2019, 10:40 AM IST
Highlights


భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ త్వరలో బ్రాడ్ బ్యాండ్, ఈ - కామర్స్ రంగాల్లోకి అడుగు పెట్టేందుకు వ్యూహాలు రూపొందించారు. ఇందుకు అవసరమైన పెట్టుబడుల కోసం విదేశీ బ్యాంకర్లతో 185 కోట్ల డాలర్ల దీర్ఘ కాలిక ఒప్పందం కోసం సంతకాలు రిలయన్స్ ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది. 

న్యూఢిల్లీ: భవిష్యత్ సంస్థ విస్తరణ లక్షాల సాధన దిశగా కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో అడుగేసింది. విదేశీ బ్యాంకర్లు, ఆర్థిక సంస్థల నుంచి 185 కోట్ల డాలర్ల (రూ.12,900 కోట్లు) దీర్ఘకాలిక రుణ సమీకరణ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 

భవిష్యత్‌ పెట్టుబడి అవసరాల కోసం కంపెనీ ఈ నిధులు సమీకరిస్తోంది. ఆర్‌ఐఎల్‌ ఇప్పటికే టెలికాం విభాగం జియోలో రూ.20 వేల కోట్ల భారీ పెట్టుబడి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. మున్ముందు 5జీ సర్వీసుల్లో ప్రవేశించడానికి ముందే బ్రాడ్‌బ్యాండ్‌, ఈ-కామర్స్‌ విభాగాలను భారీగా విస్తరించాలని ఆర్‌ఐఎల్‌ భావిస్తోంది.
 
ప్రధాన వ్యాపార విభాగాల్లో కొత్త పెట్టుబడి వ్యయాల కోసం 185 కోట్ల డాలర్ల రుణ సమీకరణకు విదేశీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఆర్‌ఐఎల్‌ నియంత్రణ సంస్థలకు ఇచ్చిన మెసేజ్‌లో పేర్కొంది. అయితే రుణ కాలపరిమితి, వడ్డీ రేటు గురించి ఎలాంటి వివరాలు అందించలేదు. 

కంపెనీ సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా దేశవిదేశాలకు చెందిన బ్యాంకర్లు, ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ అవకాశాలను రిలయన్స్ అన్వేషిస్తూ ఉంటుందని పేర్కొంది. అలాగే నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తాము తీసుకున్న రుణాల వివరాలు కూడా ప్రకటిస్తూ ఉంటుందని తెలిపింది.
 
రూ.1,700 కోట్ల విలువ గల సీఎస్ఆర్‌ నిధుల దుర్వినియోగం జరిగిందన్న అంశంపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కన్నేసిందన్న వార్తల గురించి మరో ప్రకటనలో వివరణ ఇచ్చింది. కంపెనీ నిర్వహించే సీఎస్ఆర్‌ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాలు తెలుసుకుంటూనే ఉంటుందని, ఆ శాఖ ఎప్పుడు ఏ వివరణ అడిగినా ఇస్తూనే ఉంటామని ఆర్‌ఐఎల్‌ పేర్కొంది.
 
అదే తరహాలో సీఎస్ఆర్‌ కింద అమలుపరుస్తున్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇటీవల అడిగిందని, ఆ వివరాలు అందించే ప్రయత్నం జరుగుతున్నదని తెలియచేసింది. సీఎస్ఆర్‌ నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలపై స్టాక్‌ ఎక్స్ఛేంజీలు వివరణ అడగడంతో ఆ అంశానికి సంబంధించి ఈ ప్రత్యేక ప్రకటన పొందుపరిచింది.
 
పలు ప్రముఖ ఏజెన్సీల సహకారంతో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా సీఎస్ఆర్‌ కార్యకలాపాలు చేపడుతూ ఉంటామని, దేశంలో సీఎస్ఆర్‌ కార్యకలాపాలకు భారీ ఎత్తున నిధులు సమకూర్చే కంపెనీగా నిలిచినందుకు తాము గర్విస్తున్నామని అందులో పేర్కొన్నది. 

కంపెనీల చట్టం 2013 కింద నిర్దేశించిన సీఎస్ఆర్‌ బాధ్యతలకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని రిలయన్స్ హామీ ఇచ్చింది. ఆ వివరాలన్నీ ఆడిటర్ల ధ్రువీకరణతో ప్రతీ ఏడాది విడుదల చేసే వార్షిక నివేదికలో సవివరంగా ఉంటాయని తెలిపింది.
 

click me!