మనలో చాలామంది డబ్బు లేదని నిరాశలో నిస్పృహలో కూరుకు పోతుంటారు. కానీ కొంతమంది పేదరికంలోనే పుట్టి అక్కడి నుంచి కృషితో పట్టుదలతో విజయాలు సాధిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి డాక్టర్ R. వేలుమణి. కేవలం రెండు గేదెలతో వారానికి 50 రూపాయలు సంపాదిస్తూ కడుపు నింపుకునే కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి నేడు డయాగ్నస్టిక్ ప్రపంచంలో తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. వేలకోట్లకు అధిపతిగా ఉన్నారు. ఆయన గురించి తెలుసుకుందాం.
మీరు థైరోకేర్ గురించి వినే ఉంటారు. దేశంలోనే లీడింగ్ డయాగ్నస్టిక్ కంపెనీగా పేరు సంపాదించుకుంది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనంతరం వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులతో కంపెనీని స్థాపించి నేడు వేల కోట్ల రూపాయలను సృష్టించాడు ఆయన మరెవరో కాదు థైరోకేర్ వ్యవస్థాపకుడు వేలుమణి.
థైరోకేర్ కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎ. వేలుమణి నిరాడంబరమైన వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు. తన సాదాసీదా లైఫ్ స్టైల్ కి ఆయన సుపరిచితుడు. దానికి కారణం ఆయన బాల్యం. వేలుమణి తండ్రి భూమిలేని రైతు. వేలుమణి తండ్రి కుటుంబ బాధ్యత వదిలేశాడు. దీంతో ఆయన తల్లి ఇంటిని నిలబెట్టే ప్రయత్నం చేసింది. రెండు గేదెలను కొని పాలు పోసి అమ్మడం ప్రారంభించింది. ఈ రెండు గేదెల నుండి వారానికి 50 రూపాయలు వచ్చేవి. ఈ 50 రూపాయల సహాయంతో వేలుమణి తల్లి 10 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించింది.
చదువుపై పెద్దగా అవగాహన లేని కుటుంబం నుంచి వచ్చిన వేలుమణి బీఎస్సీ పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత కోయంబత్తూరు సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో క్యాప్సూల్స్ తయారు చేసేందుకు చేరాడు.. నాలుగేళ్లలోనే కంపెనీ దివాళా తీసింది. వేలుమణి నిరుద్యోగిగా మారారు. ఆ తర్వాత చేతిలో కేవలం 400 రూపాయలతో సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబైకి పయనం అయ్యాడు. ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ( బార్క్) లో ఆయన ప్రయత్నం ఫలించి ఉద్యోగం లభించింది. అక్కడ అతనికి నెలకు 800 రూపాయలు వచ్చేవి. ఆఫీసు పని పూర్తయ్యాక స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. దీని వల్ల వేలుమణి రూ.800 అదనంగా సంపాదించడం ప్రారంభించాడు. మొత్తం రూ.1600 సంపాదించగా, అందులో రూ.1200 తన తల్లికి పంపేవాడు.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ( బార్క్) లో వేలుమణి ప్రయాణం 15 ఏళ్లపాటు సాగింది. ఈ క్రమంలోనే వేలుమణి పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ సమయంలో, థైరాయిడ్ రంగంలో టెస్టులు చేయడం ద్వారా చాలా డబ్బు సంపాదించ వచ్చని ఆయన అర్థం చేసుకున్నారు. 1995లో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన ప్రావిడెంట్ ఫండ్ రూ. 1 లక్షతో ముంబైలో థైరోకేర్ టెస్టింగ్ ల్యాబ్‌ను నిర్మించాడు.
కేవలం 1 లక్ష రూపాయల మూలధనంతో 1996లో ఏర్పాటైన ఈ కంపెనీ 2021 నాటికి 7 వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీగా అవతరించింది. ఇటీవల కాలంలో కంపెనీలో వేలుమణి షేర్ల విలువ 5 వేల కోట్లకు పెరిగిందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. డాక్టర్ ఆరోక్యస్వామి వేలుమణి ఆస్తులు ఇప్పుడు వేల కోట్లల్లో ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుంచుకోండి ఒకప్పుడు ఆయన కుటుంబం మొత్తం ఆదాయం వారానికి 50 రూపాయలు మాత్రమే.