
న్యూఢిల్లీ: భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే తన భార్య తనను వదిలేస్తుందని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఈ విధంగా స్పందించారు.
రాజకీయాల కంటే తనకు తన కుటుంబ జీవితమే ముఖ్యమని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వెళ్తే.. తన భార్య తనతో ఉండనని చెప్పేసిందని రాజన్ చెప్పారు.
బలమైన కారణం ఏదీ లేకపోయినప్పటికీ తనకు మాత్రం రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. కొందరు తమ వ్యాక్చాతుర్యంతో ఓట్లను పొందుతారని, అలాంటి నైపుణ్యం తనకు లేదని తెలిపారు. తాను ఏ పార్టీకి మద్దతుగా ఉండనని చెప్పారు.
తనకు ఉద్యోగం చేయడమంటేనే ఇష్టమని, ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం(న్యాయ్)తో కొంత వరకు ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పేదలకు నగదు అందజేయడం వల్ల వారికి కావాల్సినవి వారే కొనుగోలు చేసుకోగలరని అన్నారు.
2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ దాకా రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్‌గా రాజన్ సేవలందించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు.