కేంద్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ టెస్లా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో కార్లను తయారీ చేసి, భారత్‌లో విక్రయించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని తేల్చి చెప్పారు.
కేంద్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ టెస్లా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో కార్లను తయారీ చేసి, భారత్‌లో విక్రయించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని తేల్చి చెప్పారు. కార్లను భారత్‌లోకి దిగుమతి చేసి విక్రయిస్తామని, తమకు భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు కావాలని టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ కోరుతున్నారు. అయితే భారత్‌లో తయారీ ఉంటేనే తాము ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తామని, చైనాలో తయారు చేసి, ఇక్కడ అమ్ముతామంటే కుదరదని, ఆ ప్రతిపాదనను తాము అంగీకరించలేమని గడ్కరీ అన్నారు.
ఈ మేరకు గడ్కరీ ఓ మీడియా ఇంటర్వ్యూలో టెస్లా అంశంపై స్పందించారు. మూడు, నాలుగు రోజుల క్రితం టెస్లా భారత శాఖ అధినేతతో సంప్రదింపులు జరిపామని, ఆ సమయంలో తాను టెస్లా తయారీ, ప్రోత్సాహకాలు, రాయితీలకు సంబంధించి వివరాలు చర్చించానని అన్నారు. ఇక్కడే తయారీ, ఇక్కడే విక్రయం అయితేనే తాము రాయితీలు కల్పిస్తామని చెప్పామన్నారు. మా ప్రయత్నాలు మేం చేశామని, ఇక నిర్ణయం వారికే వదిలేశామన్నారు. అంటే దేశంలో ఉత్పత్తి చేస్తేనే వారు అడిగిన వాటికి అంగీకరిస్తామని గడ్కరీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
undefined
భారత రోడ్లపై టెస్లా కార్లు తిరగాలంటే మొదట వాటిని ఇక్కడే తయారు చేయాలా అని మీడియా ప్రతినిధి అడగ్గా గడ్కరీ స్పందిస్తూ.. అతని (మస్క్) చైనాలో తయారు చేసి, ఇండియాలో విక్రయించాలని ఆసక్తిగా ఉన్నారని, కానీ మీరు ఇక్కడ ప్రారంభిస్తామంటే మేం స్వాగతిస్తామని, తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ చైనాలో తయారు చేసి, భారత్‌లో విక్రయించడాన్ని తాము అంగీకరించలేమన్నారు.
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల పైన కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలన్న డిమాండ్‌కు అంగీకరిస్తారా అని మీడియా ప్రతినిధి అడగగా, గడ్కరీ స్పందిస్తూ.. ఒక ఆటోమొబైల్ కంపెనీ కోసం అలా చేయలేమన్నారు. భారత్ అతిపెద్ద మార్కెట్ అని, బీఎండబ్ల్యు, వోల్వో, మెర్సిడెజ్, బెంజ్, టయోటా, హోండా, హ్యుండాయ్ వంటి దిగ్గజ కంపెనీలు భారత మార్కెట్‌లో ఉన్నాయని చెప్పారు. ఒక కంపెనీకి తాము సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే, మిగతా కంపెనీల మాటేమిటన్నారు. ఇది సమస్యగా మారుతుందన్నారు.