దేశంలోని వివిధ ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరల్ని పెంచుతున్నాయి. మారుతి సుజుకీ, మహీంద్ర, టయోటా తరువాత ఇప్పుడు టాటా మోటార్స్ సైతం కార్ల ధరల్ని పెంచుతోంది. వివిధ మోడళ్లపై కలిపి దాదాపుగా 1.1 శాతం ధర పెంచింది. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడంతో ధరల్ని స్వల్పంగా పెంచాయి. ఈ పెరిగిన ధరలు శనివారం నుంచే అంటే ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వచ్చాయి.
దేశంలో వాహనాల ధరలు మరింత ప్రియం అయ్యాయి. వాటి ధరలకు రెక్కలు మొలిచాయి. ఒక తయారీ కంపెనీ తన కార్లు.. ఇతర వాహనాల ధరలను పెంచితే.. మిగిలినవన్నీ దాన్ని అనుసరించడం ఆటోమొబైల్ సెక్టార్‌లో ఎప్పుడూ ఉండేదే. అదే ఆనవాయితీ ఇప్పుడు మళ్లీ కనిపిస్తుంది. ఇదివరకు మారుతి సుజుకి తన వాహనాల రేట్లను పెంచింది. ఇప్పుడు తాజాగా టాటా మోటార్స్ అదే బాటలో నడిచింది. రేట్లను పెంచినట్లు ప్రకటించింది.
అన్ని రకాల ప్యాసింజర్ వాహనాల రేట్లను పెంచినట్లు టాటా మోటార్స్ తాజాగా ప్రకటించింది. తక్షణమే పెరిగిన ధరలను అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు టాటా మోటార్స్ యాజమాన్యం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని మోడల్స్ కార్ల రేట్లను పెంచినట్లు స్పష్టం చేసింది. 0.1 శాతం నుంచి 1.1 శాతం వరకు వాటి రేట్లను సవరించినట్లు వివరించింది. కార్ల తయారీలో వినియోగించే పరికరాలు, విడి భాగాల ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఇన్‌పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని, దాని ప్రభావం వాహనాల తయారీపై పడిందని తెలిపింది.
undefined
ఈ నెల 18వ తేదీన మారుతి సుజుకి తన వాహనాల రేట్లను పెంచిన విషయం తెలిసిందే. మారుతి సుజుకిలో బేసిక్ కార్ మోడల్‌గా పేరున్న ఆల్టో మొదలుకుని ఎస్-క్రాస్ వరకు అన్ని వాహనాల రేట్లనూ సవరించింది. 3.15 నుంచి 12.56 లక్షల రూపాయల వరకు వాటి రేట్లు ఉన్నాయి. గత సంవత్సరం మారుతి సుజుకి యాజమాన్యం మూడు సార్లు కార్ల రేట్లను పెంచింది. జనవరి-1.4, ఏప్రిల్-1.6, సెప్టెంబర్-1.9 శాతం మేర పెంచింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఈ నెల వరకు తొమ్మిది శాతం మేరకు ధరలు పెంచింది.
మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తన వాహనాల రేట్లను పెంచింది. దీనిపై ఈ నెల 14వ తేదీన ప్రకటన విడుదల చేసింది. ఒక్కో వాహనంపై అదనంగా 10,000 నుంచి 63,000 రూపాయల వరకు భారం పడింది. విడి భాగాలు, ఇతర పరికరాల రేట్లు, ఇన్‌పుట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే ఉద్దేశంతో కార్లు, ఇతర వాహనాల రేట్లను పెంచబోతున్నట్లు స్పష్టం చేసింది. ఒక వాహనాన్ని తయారు చేయడానికి అవసరమైన స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం, కాపర్, ఇతర విలువైన మెటల్స్ ధరలు భారీగా పెరిగాయని, ఆ భారాన్ని తాము మోయలేకపోతున్నాంటూ మారుతి సుజుకి ముందు నుంచీ చెబుతూ వస్తోంది.