ఇటలీలో ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ పియాజియో భారతీయ మార్కెట్లోకి విద్యుత్ వినియోగంతో నడిచే ఆటోను ఆవిష్కరించింది. దీని ధరను రూ.1.97 లక్షలుగా నిర్ణయించారు.
న్యూఢిల్లీ: ప్రముఖ ఇటలీ ఆటో దిగ్గజం పియాజియో మార్కెట్లోకి ఎలక్ర్టిక్ త్రీ వీలర్ వాహనాన్ని బుధవారం విడుదల చేసింది. అపే ఈ-సిటీ పేరుతో తెచ్చిన ఈ ఆటో ధర రూ.1.97 లక్షలుగా నిర్ణయించారు. దీని విడుదల కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పియాజియో వెహికిల్స్ ఎండీ, సీఈఓ డీగో గ్రాఫి పాల్గొన్నారు.
also read ఇండియాలో మోరిస్ గ్యారేజీ భారీగా పెట్టుబడులు...మరో నాలుగు కొత్త మోడళ్ళు
undefined
ఈ ఆటోలో లిథియం అయాన్ బ్యాటరీని వినియోగించారు. దీన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది. బ్యాటరీ, చార్జింగ్ మౌలిక వసతుల కోసం చేతన్ మైనీ సారథ్యంలోని సన్ మొబిలిటీతో కంపెనీ చేతులు కలిపింది. ‘ఎలక్ర్టిక్ టెక్నాలజీ అభివృద్ధిలో పియాజియో గ్రూపునకు 15 ఏళ్ల చరిత్ర ఉంది. దీని ద్వారానే భారత మార్కెట్ కోసం ఉత్పత్తులు తెచ్చాం’ అని డీగో గ్రాఫి అన్నారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉండే బ్యాటరీతోపాటు ఫిక్స్‌డ్ బ్యాటరీ టెక్నాలజీ ఉత్పత్తులను అభివృద్ధి చేశామన్నారు.
వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో ఫిక్స్డ్ బ్యాటరీ త్రీ వీలర్ తీసుకువస్తామని డీగో గ్రాఫి పేర్కొన్నారు. ప్యాసెంజర్, గూడ్స్ క్యారేజ్ విభాగంలో ఎలక్ర్టిక్ వెర్షన్లను తీసుకువస్తామని చెప్పారు. సన్ మొబిలిటీ భాగస్వామ్యంతో మొదటి విడతలో భాగంగా చండీగఢ్, మొహాలీ, గురుగ్రామ్ నగరాల్లో అపే ఈ-సిటీని అందుబాటులోకి తెస్తామని డీగో గ్రాఫి తెలిపారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి 10 నగరాల్లో త్వరగా చార్జింగ్ చేసేందుకు వీలుకల్పించే స్టేషన్లను ఏర్పాటు చేస్తామని డీగో గ్రాఫి పేర్కొన్నారు. బారామతి ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.5 లక్షల యూనిట్లుగా ఉంది. 2018 నుంచి 2022 వరకు రూ.300 కోట్ల మూలధన వ్యయం చేయాలని కంపెనీ నిర్ణయించింది.
also read ఆటో ఇండస్ట్రీ లేకుండా 5లక్షల కోట్ల...అసాధ్యం...
వచ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా 10 ప్రధాన నగరాలలో వీటిని అందుబాటులోకి తేనున్నట్టుగా పియాజీయో సంస్థ ఎండీ, సీఎంటీ డీగో గ్రాఫీ వివరించారు. 2018-22 మధ్య సంస్థ కార్యకలాపాల విస్తరణకు రూ.300 కోట్ల మేర నిధులను కేటాయించినట్టు వివరించారు. ఈ కొత్త విద్యుత్తు ఆటోరిక్షా లక్ష కిలోమీటర్లు లేదా మూడేండ్ల వారెంటీతో అందుబాటులోకి తెస్తున్నట్టుగా వివరించారు.