Luxury cars: లగ్జరీ కార్లకు పెరుగుతున్న ఆర్డర్లు.. భారత్‌లో పెరుగుతున్న సేల్స్‌..!

By team telugu  |  First Published Apr 27, 2022, 10:39 AM IST

భారత్‌లో రోజురోజుకూ లగ్జరీ కార్లపై ప్రేమ పెరుగుతుంది. దీంతో విలాసవంతమైన కార్లు తయారు చేసే సంస్థలు.. మెర్సిడేజ్‌ బెంజ్‌, ఆడీ, బీఎండబ్ల్యూ కొనుగోలుదారులకు అభిరుచికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నాయి. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటున్నాయి. సరికొత్త మోడల్స్‌తో వాహన రంగంలో రాణిస్తున్నాయి. విలాసవంతమైన కార్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో.. డెలివరీకి కూడా ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి.


ఇండియాలో ఎకానమిక్ బూమ్ తో ఎంతో మంది తలరాతలు మారిపోయాయి. చాలా మందికి సిరిసంపదలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఎంతో మంది కోటీశ్వరులు అయిపోయారు. దీంతో తమ స్థాయికి తగ్గట్లుగా లగ్జరీ కార్లను కొనుక్కొని ఎంజాయ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంపన్న వర్గం సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండడంతో లగ్జరీ కార్లకు కూడా డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది.

ఒకప్పుడు కుబేరులకే పరిమితమైన ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌ ప్రీమియం ఎండ్‌ కార్లను కొనేందుకు ఇప్పుడు చాలా మంది పోటీపడుతున్నారు. దీంతో ఈ కంపెనీలకు చెందిన ప్రీమియం ఎండ్‌ కార్ల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదు అవుతోంది. కొందటి రోజుల్లో ఇలాంటి లగ్జరీ కార్లను సెలెబ్రిటీలు కొనుగోలు చేసే వాళ్లు.. ముఖ్యంగా సినీ ప్రముఖులు,   క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు కొనుక్కునే వాళ్లు. అయితే ఇప్పుడు  ట్రెండ్  మారింది. ఇప్పుుడిప్పుడే పైకి వస్తూ నాలుగు డబ్బులు వెనకేసుకున్న వాళ్లు కూడా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రవాణా నౌకలు అందుబాటులో లేకపోవడంతో బుక్ చేసుకున్న  టాప్‌ ఎండ్‌ ప్రీమియం కార్ల కోసం కస్టమర్లు నాలుగైదు నెలలు వరకు వెయిట్ చేస్తున్నారు. కొంత మంది అయితే గరిష్ఠంగా ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తోంది. 

Latest Videos

undefined

ముఖ్యంగా రూ.70-75 లక్షల మధ్యలో ఉన్న సీ,డీ సెగ్మెంట్‌  కార్లకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది.  ఈ కేటగిరిలో ముఖ్యంగా మెర్సిడెస్ బెంజ్ కార్లను వాహనదారులు అమితంగా ఇష్టపడుతున్నారు. అందుకే జీఎల్‌ఎస్‌, జీఎల్‌ఈ (ఎస్‌యూవీలు) బ్రాండ్ కార్ల కోసం  ఏడాది వరకు కూడా వెయిట్ చేస్తున్నారని మెర్సిడెస్‌ బెంజ్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ అన్నారు. ఈ ఏడాది ఫస్ట్ క్వారట్ లో ఇప్పటి వరకు తమకు  4,000 కార్లకు ఆర్డర్‌ వచ్చాయని మెర్సిడెస్ ప్రకటించింది. వీటిని సప్లై చేసేందుకు తమకు ఇంకా సమయం కావాలని కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తోంది.  ఇక కిందటి ఏడాది కోటి కంటే ఎక్కువ ధర ఉన్న కార్లు దేశవ్యాప్తంగా రెండు వేలకు పైగా అమ్ముడుపోయాయని ప్రకటించింది. ఈ కార్లలో  జీఎల్‌ఎస్‌ మేబాక్‌, ఎస్‌-క్లాస్‌ మేబాక్‌, ఎస్‌-క్లాస్‌, టాప్‌ ఎండ్‌ ఏఎంజీ, జీఎల్‌ఎస్‌ ఎస్‌యూవీ ఉన్నాయని తెలిపింది. 

మెర్సిడెస్ కు బీఎండబ్ల్యూ గట్టి పోటీ ఇస్తోంది. ఎక్స్‌3, ఎక్స్‌4, ఎక్స్‌7 వంటి స్పోర్ట్స్‌ యాక్టివిటీ వాహనాల విభాగంలో తనకు ఎవరూ పోటీ లేకుండా చూసుకుంటోంది. తమ మొత్తం కార్ల అమ్మకాల్లో వీటి వాటా 50 శాతం వరకు ఉందని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా  తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర 2,500 లగ్జరీ కార్లకు ఆర్డర్‌ ఉందని చెప్పారు.  కిందటి ఏడాదితో పోల్చితే తమ అమ్మకాల్లో 25.3 శాతం వృద్ధి నమోదు అయిందని వెల్లడించారు. ఆర్డర్లు పెరిగిపోతుండడంతో సకాలంలో కస్టమర్లకు డెలివరీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సంపన్నులు తమ తమ స్థాయిలకు తగ్గట్లు.. బెంట్లీ, లెక్సస్, ల్యాండ్ రోవర్, మసెరటి, రోల్స్ రాయిస్ తదితర సంస్థల కార్లను తెగ కొనేస్తున్నారు.
 

click me!