ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే గత నెలలో ఒక్క వాహనం కూడా విక్రయించలేదని టూ వీలర్ దిగ్గజ సంస్థలు టీవీఎస్ మోటార్స్ కంపెనీ, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా తెలిపారు. కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటమే దీనికి కారణం.
న్యూఢిల్లీ: ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే గత నెలలో ఒక్క వాహనం కూడా విక్రయించలేదని టూ వీలర్ దిగ్గజ సంస్థలు టీవీఎస్ మోటార్స్ కంపెనీ, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా తెలిపారు. కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటమే దీనికి కారణం.
టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ ‘కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వం ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా నిలిచేందుకు మేం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం‘ అని పేర్కొంది.
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చి 23 నుంచి తమ ఉత్పాదక ప్లాంట్లను, డీలర్ షిప్ షోరూములను మూసివేశామని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. దీనివల్ల ఏప్రిల్ నెలలో ఒక్క వాహనం కూడా విక్రయించలేదని వెల్లడించింది.
చెన్నై పోర్ట్ ట్రస్ట్ పరిధిలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 8,134 ద్విచక్ర వాహనాలను, 1506 త్రీ వీలర్స్ ఎగుమతి చేసినట్లు టీవీఎస్ మోటార్స్ తెలిపింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యకలాపాలను పున: ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది.
also read:గుడ్‌న్యూస్: రూ. 5 లక్షల రుణాలిచ్చేందుకు బ్యాంకులు రెడీ
అదే సమయంలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని టీవీఎస్ మోటార్స్ హామీ ఇచ్చింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత వ్యక్తిగత వాహనాల విభాగంలో గిరాకీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు ఏప్రిల్ నెలలో దేశీయంగా ఒక్క వాహనం విక్రయించకున్నా 2630 ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసిటన్లు హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ వెల్లడించింది.
ఇదిలా ఉంటే, కరోనా నేపథ్యంలో అంతా ప్రభుత్వం ప్రకటించే ఉద్దీపనల కోసం ఎదురు చూస్తుంటే.. హీరో మోటర్స్, హీరో సైకిల్స్ మాత్రం తమకు ఆ అవసరం లేదని ప్రకటించాయి. ప్రభుత్వ సాయం లేకుండానే ఈ కష్టకాలాన్ని అధిగమించగలమని హీరో సైకిల్స్ సీఎండీ పంకజ్ ముంజాల్ ధీమా వ్యక్తం చేశారు.
‘మేం ఏవిధమైన మద్దతు కోసం ఎదురు చూడటం లేదు. మాది రుణ రహిత సంస్థ’ అని ముంజాల్ అన్నారు. తమకు బలమైన కస్టమర్లు ఉన్నారని చెప్పారు. కాగా, పరిశ్రమపై కరోనా ప్రభావంతో సైకిళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి ప్రభుత్వం తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ-బైక్‌లపై జీఎస్టీ 5 శాతమేనని గుర్తు చేశారు.