పండుగ సీజన్ లో కాస్త ఊరించిన...మళ్ళీ పడిపోయాయిన ఆటో సేల్స్..

By Sandra Ashok KumarFirst Published Dec 11, 2019, 11:34 AM IST
Highlights

పండుగ సీజన్ కాసింత మురిపించినా తర్వాతీ నెల నవంబర్‌లో ఆటో సేల్స్ స్వల్పంగా పడిపోయాయి. యుటిలిటీ వాహనాలకు మాత్రం డిమాండ్ పెరిగింది. ద్విచక్ర వాహనాల విక్రయాల్లోనూ తగ్గుముఖం పట్టింది.
 

న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన విక్రయాలు మళ్లీ పడిపోయాయి. పండుగ సీజన్ అక్టోబర్‌లో కాస్త కోలుకున్నాయనుకున్న వాహనాల సేల్స్‌లో ఆ మరుసటి నెలలోనే ప్రతికూల ప్రగతి చోటు చేసుకున్నది. దేశవ్యాప్తంగా డిమాండ్ లేకపోగా, అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వాహన ఉత్పత్తి సంస్థలు డీలర్లను భారీగా తగ్గించుకోవడం విక్రయాలపై ప్రభావం చూపిందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఆందోళన వ్యక్తంచేసింది.

గత నెలలో దేశీయంగా 2,63,773 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడు పోయాయి. 2018 నవంబర్ నెలలో అమ్ముడైన 2,66,000లతో పోలిస్తే 0.84 శాతం తగ్గాయి.కానీ, యుటిలిటీ వాహనాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం విశేషం. గత నెలలో ఏకంగా 92,739 యుటిలిటీ వాహనాలు అమ్ముడయ్యాయి. 2018 ఏడాది నవంబర్‌లో అమ్ముడైన 69,884లతో పోలిస్తే 32.7 శాతం అధికం. 

also read తెలంగాణలో కొత్త ఈ-టాక్సీ సేవలు...పర్యావరణానికే ప్రియారిటీ

దేశవ్యాప్తంగా కార్ల అమ్మకాలు 10.83 శాతం తగ్గి 1,60,306లకు పడిపోయాయి. గతేడాది నవంబర్ నెలలో 1,79,783 వాహనాలు అమ్ముడయ్యాయి. వ్యాన్ల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 34.32 శాతం తగ్గి 10,728లకి జారుకున్నాయి.ఏడాది ప్రాతిపదికన 2019 నవంబర్ నెలలో ద్విచక్ర వాహన అమ్మకాలు 14.27 శాతం తగ్గి 14,10,939లకు పడిపోయాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో 16,45,783లు అమ్ముడయ్యాయి.

వీటిలో మోటర్ సైకిల్ సేల్స్ 14.87 శాతం పతనం చెంది 8,93,538 వాహనాలకు పడిపోగా, స్కూటర్ విక్రయాలు కూడా 11.83 శాతం జారుకుని 4,59,851కి తగ్గాయి. కమర్షియల్ వాహన సేల్స్ 15.98 శాతం దిగువకు పడిపోయాయి. గత నెలలో కేవలం 61,907 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రయాణికుల వాహనాల సంస్థలు మారుతి సుజుకీ 3.31 శాతం తగ్గగా, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు కూడా 9.62 శాతం తగ్గాయి. హ్యుండాయ్ మోటర్ సేల్స్ 2.04 శాతం పెరుగడం విశేషం. 

ద్విచక్ర వాహన విభాగ సంస్థల్లో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 15.81 శాతం పడిపోగా, హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ కూడా 5.32 శాతం క్షీణించగా, టీవీఎస్ మోటర్ అమ్మకాలు కూడా 26.52 శాతం పడిపోయాయి. గతనెలలో మొత్తంగా 17,92,415 వాహనాలు అమ్ముడయ్యాయి. 2018 ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 20,38,007లతో పోలిస్తే 12.05 శాతం తగ్గాయి.

హ్యుండాయ్ కార్లు మరింత ప్రియం
ప్రముఖ వాహన సంస్థ హ్యుండాయ్ కూడా తన వాహన ధరలను పెంచేసింది. ఉత్పత్తి వ్యయం పెరుగడంతో వచ్చే నెల నుంచి అన్ని రకాల వాహన ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ రకాల వాహన ధరల పెంపులో వ్యత్యాసం ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎంత ధర పెంచుతున్నదో మాత్రం సంస్థ వెల్లడించలేదు. 

also read కొత్త సంవత్సరంలో వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న హ్యుందాయ్

ఉత్పత్తి వ్యయం పెరుగడంతోపాటు ముడి సరుకుల ధరలు ఎగబాకడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని హ్యుండాయ్ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ధరల పెంపుపై చర్చలు జరుగుతున్నాయని, ఈ నెల చివరినాటికి కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నదని తెలిపింది. ఇదివరకే మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మెర్సిడెజ్ బెంజ్, మహీంద్రా అండ్ మహీంద్రా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ మాట్లాడుతూ ‘ప్యాసింజర్ వాహన విక్రయాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గతేడాదితో పోలిస్తే గత నెలలో అమ్మకాల్లో క్షీణత నమోదైంది. పండుగ సీజన్‌కావడంతో అక్టోబర్‌లో స్వల్ప వృద్ధిని నమోదు చేసుకున్న పీవీ అమ్మకాలు ఆ మరుసటి నెలలో మళ్లీ దిగువకు పడిపోయాయి’ అని చెప్పారు.

‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పీవీల అమ్మకాలు మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటు కమర్షియల్, ద్విచక్ర వాహన అమ్మకాలు కూడా మరింత పతనం చెందాయి. వరుసగా రెండు నెలల్లో పలు యుటిలిటీ వాహనాలు విడుదల కావడంతో ఈ రంగంలో వృద్ధి నమోదైంది’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు. 

click me!