అది బిగ్ మిస్టేక్: డిస్కవర్‌ 100సీసీ విడుదలపై రాజీవ్‌ బజాజ్‌ కుండ బద్దలు

By sivanagaprasad kodati  |  First Published Nov 23, 2018, 9:19 AM IST

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటోమొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తమ ద్విచక్ర వాహనాల విభాగంలో చేసిన పొరపాట్లను బయట పెట్టారు. డిస్కవరీ 125 సాధించిన విజయంతో తక్కువ సామర్థ్యం గల 100 సీసీ డిస్కవరీ బైక్ డిజైన్ విడుదల చేయడమే తన కెరీర్‌లోనే అతిపెద్ద పొరపాటని పేర్కొన్నారు.
 


డిస్కవర్‌ బైక్‌ విభాగంలో 100 సీసీ వేరియంట్‌ను విడుదల చేయడం తన కెరీర్‌లోనే అతిపెద్ద తప్పిదమని బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ బైక్ వల్లే తమ కంపెనీ ద్విచక్ర వాహన మార్కెట్లో రెండో స్థానానికే పరిమితమైందని అన్నారు.

గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్‌ బజాజ్‌ తన మనస్సులో మాట బయటపెట్టారు. ‘డిస్కవర్‌ను తొలుత 125 సీసీ ఇంజన్‌ సామర్థ్యంతో, అధిక మైలేజీ ఇచ్చే బైక్‌గా మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. 125 సీసీ డిస్కవర్‌కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. భారీగా విక్రయాలు జరిగాయి. దాంతో మరింత ఆర్జించాలన్న కాంక్ష పెరిగింది’ అని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు.

Latest Videos

undefined

కానీ తక్కువ సీసీ వేరియంట్‌ను విడుదల చేస్తే కంపెనీ విక్రయాలు మరింత పెరుగుతాయన్న మార్కెటింగ్‌ విభాగ మాటలు నమ్మి 100 సీసీ డిస్కవర్‌ను విడుదల చేశామని చెప్పారు. దాంతో కంపెనీ తన స్థానాన్ని, ఐదేళ్ల తర్వాత పనితీరునూ కోల్పోయిందని పేర్కొన్నారు. లేదంటే, సంస్థ ప్రస్తుత పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేదన్నారు.
 
కేటీఎం భవిష్యత్‌పైన మాత్రం ఆశాజనకంగా ఉన్నట్లు బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్‌ చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన రేసింగ్‌ బైకుల తయారీ కంపెనీ కేటీఎంలో బజాజ్‌ ఆటో 2007లో పెట్టుబడులు పెట్టింది.

తాము పెట్టుబడులు పెట్టిన సమయంలో కేటీఎం ఏటా 65 వేల బైకులను ఉత్పత్తి చేస్తూ యూరోపియన్‌ మార్కెట్లో నెంబర్‌ 2 మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ఉందని చెప్పారు. ఏటా 3.5 లక్షల బైకుల తయారీతో హార్లే డేవిడ్‌సన్‌ అప్పట్లో నెంబర్‌ 1 బ్రాండ్‌గా చెలామణి అవుతుండేది. కానీ పరిస్థితులు మారుతూ వచ్చాయి.

కేటీఎం బైకులకు ఏటేటా డిమాండ్‌ పెరగగా.. హార్లే విక్రయాలు తగ్గుతూ వచ్చాయి. ఈ ఏడాది కేటీఎం బైకుల ఉత్పత్తి 2.7 లక్షల యూనిట్లకు చేరుకోనుండగా.. హార్లే బైకులు 2.4 లక్షల యూనిట్లకు పరిమితం కావచ్చని బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్‌ తెలిపారు.  
 
వచ్చే ఏడాది లో ఈ-బైక్‌ల విభాగంలోకి: బజాజ్‌
తమ సంస్థ 2019లో ఎలక్ట్రిక్‌ బైక్‌ల విభాగంలోకి ప్రవేశించనుందని బజాజ్ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వెల్లడించారు. అయితే, నాసిరకం వేరియంట్లను విడుదల చేస్తూ ఇండస్ట్రీ ఈ-బైక్‌ల పట్ల సవతి తల్లిలా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో అంతర్జాతీయంగా పేరున్న టెస్లా కంపెనీ స్థాయి ప్రమాణాలతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు తయారు చేస్తామన్నారు.

click me!