ఒకనాడు కుర్రాళ్లను ఉర్రూతలూగించిన జావా మోటార్ బైక్‌లు మళ్లీ రంగ ప్రవేశం చేయనున్నాయి. చెకోస్లోవేకియాకు చెందిన ఈ సంస్థ బైక్‌తోపాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు అంటే కుర్రోళ్లకు యమ క్రేజీ మరి. కానీ 1990వ దశకంలో హీరో హోండా, టీవీఎస్ సుజుకి మోటార్స్ తదితర సంస్థలు తెచ్చిన బుల్లి బైక్‌ల ఆకర్షణ ముందు నిలువలేకపోయాయి. మళ్లీ ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్, జావా బైక్‌ల వైపు గాలి మళ్లుతోంది. జావా బైక్ కూడా ప్రస్తుత టెక్నాలజీని అంది పుచ్చుకుని సరికొత్తగా కుర్రాళ్లలో క్రేజీ పెంచేందుకు ఈ నెల 15న ముందుకు దూసుకొస్తున్నది.
కుర్రకారులో హుషారెత్తించే మోటారు సైకిళ్ల రారాజు ‘జావా’ సంస్థ మోటారు సైకిళ్లు భారతీయ మార్కెట్లో సందడి చేయనున్నాయి. చెకోస్లోవేకియా బ్రాండ్ జావా బైక్‌లు భారతీయ యువతను ఆకట్టుకునే విధంగా సరికొత్తగా ముస్తాబు చేసి మహీంద్రా అండ్ మహీంద్రా ముందుకు తీసుకు రానున్నది.
మళ్లీ ఈ నెల15వ తేదీన ఈ జావా మోటార్‌సైకిళ్లు రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఈ సందర్భంగా అప్‌కమింగ్ బైక్ డెస్ట్ డ్రైవ్ నిర్వహించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సీసీ బైక్‌కు పోటీగా ఈ జావా 300 బైక్‌ను కంపెనీ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
undefined
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 293 సీసీ సింగిల్ సిలిండర్, 27బీహెచ్‌పీ, గరిష్టంగా 28ఎన్‌ఎం టార్క్, 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, 18 అంగుళాల ఎంఆర్‌ఆఫ్ టైర్లు, డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ సెటప్‌తో రానుంది. ఏబీఎస్ (ఆటోమేటిక్ బ్రేకి సిస్టం) ను అమర్చిందీ లేనిదీ స్పష్టతలేదు. ఇక ధర రూ.1.5 - రూ.1.75 లక్షల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా1929లో తయారైన ఈ జావా మోటారు సైకిల్‌కు ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సమానంగా క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే చిన్న బైక్‌ల రాకతో 1990ల తర్వాత మార్కెట్‌లో కనుమరుగైనా బైక్ లవర్స్ గుండెల్లో మాత్రం పదిలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మహీంద్ర గ్రూపు ఈ ఐకానిక్ జావా బ్రాండ్‌ను తిరిగి మార్కెట్లో ఆవిష్కరిస్తోంది.
దాదాపు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సీసీ మోడల్ బైక్‌ను పోలి ఉండే రౌండ్ మిర్రర్స్, ఇండికేటర్లు, టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ ఎగ్జాస్ట్ మఫ్లర్లు జావా 300 మోడల్ బైక్ లోనూ లభిస్తాయి. రౌండెడ్ హెడ్ లైట్, కర్వీ ట్యాంక్, స్పోక్ వీల్స్, ఫ్లాట్ సీటు ఉంటుంది.
ఇటలీలోని వారెసెలో ఉత్పత్తయ్యే జావా మోటార్ బైకులు భారతదేశంలోనూ తయారు కానున్నాయి. జావా మోటార్ సైకిల్ ఇంజిన్‌ను మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న పుణె ఆర్ అండ్ డీ సెంటర్, ఇటలీలోని వరెసె టెక్నికల్ సెంటర్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అభివ్రుద్ధి చేశారు.
మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపిన వివరాల ప్రకారం ‘జావా300’ మోడల్ బైక్ బీఎస్ - 6 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. 6- స్పీడ్ గేర్ బాక్స్, 27 హెచ్పీ, 28 ఎన్ఎం పీక్ టార్చ్ కూడా అమర్చారు.
నూతన జావా మోటార్ బైక్ ఫ్రేమ్ మహీంద్రా మొజొ బైక్‌తో విభిన్నంగా కనిపిస్తుంది. ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్ట్, ట్విన్ షాక్ అబ్జార్బర్లు, వెనుకవైపు దిగువన గ్యాస్ చార్జ్‌డ్ కనిస్టర్ అమర్చారు. ఫ్రంట్‌లో సింగిల్ డిస్క్ బ్రేక్‌ను హ్యాండిట్ చేసేలా, వెనుకవైపు రేర్ డ్రమ్ బ్రేక్ ఏర్పాటు చేశారు. కనుక సరికొత్త జావా సింగిల్ చానెల్ ఏబీఎస్ యూనిట్‌గా నిలువనున్నది.