ఈ-స్కూటర్‌గా బజాజ్ ‘చేతక్‌' రీ ఎంట్రీ.. ఒక్క చార్జింగ్‌తో 95కి.మీ మైలేజ్

By narsimha lode  |  First Published Jan 15, 2020, 9:24 AM IST

దేశీయ ద్విచక్ర వాహన రంగంలో 90వ దశకం వరకు ‘హమారా బజాజ్‌' అని రాజసం ఒలకబోసిన చేతక్‌ స్కూటర్‌ మళ్లీ వచ్చేసింది


ముంబై/ బెంగళూరు: దేశీయ ద్విచక్ర వాహన రంగంలో 90వ దశకం వరకు ‘హమారా బజాజ్‌' అని రాజసం ఒలకబోసిన చేతక్‌ స్కూటర్‌ మళ్లీ వచ్చేసింది. అయితే ఇప్పుడు మామూలు స్కూటర్‌ మాదిరిగా కాక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రూపంలో రీఎంట్రీ ఇచ్చింది. 

ద్విచక్ర వాహన కొనుగోలుదారులను దీర్ఘకాలం నుంచి ఊరిస్తున్న చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను బజాజ్‌ ఆటో సంస్థ మంగళవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. లక్షగా బజాజ్ ఆటో నిర్ణయించింది. 

Latest Videos

undefined

ఈ స్కూటర్ల బుకింగ్‌లు బుధవారం నుంచి ప్రారంభం అవుతాయని, ఫిబ్రవరి చివరి నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని, తొలుత రెండు నగరాలు పుణె, బెంగళూరుల్లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

‘జనవరి 15 నుంచి రెండు నగరాల్లో చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. దీంతో దేశీయ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త శకం మొదలవుతుంది’ అని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు. బజాజ్‌ ఆటో కంపెనీ గతేడాది అక్టోబర్‌లోనే కొత్త చేతక్‌ను ఆవిష్కరించింది. 

Also read:హోండా కార్లపై బంపర్ ఆఫర్లు: రూ. 5 లక్షల వరకు తగ్గింపు

ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అర్బన్‌, ప్రీమియం వేరియంట్లలో లభ్యమవుతుందని, వీటితోపాటు ప్యాకేజీలో హోం-చార్జింగ్‌ స్టేషన్‌ కూడా ఉంటుందని కంపెనీ వివరించింది. చేతక్‌ వెబ్‌సైట్‌లో రూ.2 వేలు చెల్లించి కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో ఈ స్కూటర్లను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

లిథియం అయాన్‌ బ్యాటరీతో కలిపి ఓవరాల్‌గా 50 వేల కి.మీ. లేదా మూడేండ్ల (ఈ రెండింటిలో ఏది ముందయితే అది) వారంటీని కలిగి ఉండే ఈ స్కూటర్‌ను ఒకసారి చార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 95 కి.మీ., స్పోర్ట్స్‌ మోడల్‌ అయితే 85 కి.మీ. మైలేజీ ఇస్తుందని బజాజ్‌ కంపెనీ పేర్కొన్నది. 

డ్రమ్‌ బ్రేకులతో లభ్యమయ్యే ‘చేతక్‌ అర్బన్‌' ఎడిషన్‌ ఎక్స్‌-షోరూం ధరను రూ.1 లక్షగా, డిస్క్‌ బ్రేకులతోపాటు లగ్జరీ ఫినిష్‌తో లభ్యమయ్యే ‘ప్రీమియం’ ఎడిషన్‌ ధరను రూ.1.15 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బజాజ్ ద్విచక్ర వాహనాలను మళ్లీ విక్రయిస్తోంది. 

ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో దాదాపు 95 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 85 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బజాజ్ స్కూటర్ బ్యాటరీని ఫుల్‌గా రీచార్జి చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. 

భారతదేశంలో ఫ్లాస్టిక్ బాడీకి బదులు మెటల్ బాడీతో తయారు చేసిన తొలి ద్విచక్ర వాహనం ఇదే కావడం విశేషం. మహారాష్ట్రలోని చకన్ ఫ్యాక్టరీలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీని ప్రారంభించినట్లు బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి చేతక్ స్కూటర్ల తయారీ చేపట్టినట్లు వివరించారు. 

click me!