
ముంబై: మహీంద్రా ఆఫ్ రోడ్ వాహనం అంటే ‘థార్’ గుర్తుకు వస్తుంది. అది ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ సంస్థాన వారసుడు, యువరాజు లక్షరాజ్ సింగ్ మేవార్ సొంతమైంది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. లిమిటెడ్ ఎడిషన్‌గా ఉత్పత్తి చేసిన ‘థార్ 700’ వాహనం తాళాన్ని లక్ష్య రాజ్ సింగ్‌కు అందజేశారు.
లిమిటెడ్ ఎడిషన్‌గా విపణిలోకి ‘థార్ 700’
ఈ ఏడాది ప్రారంభంలో ‘థార్ 700’ వాహనాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి తీసుకొచ్చింది. ఈ ఎడిషన్ కార్లు కేవలం 700 మాత్రమే మహీంద్రా అండ్ మహీంద్రా ఉత్పత్తి చేసింది. దీనికి మరొక స్పెషాలిటీ కూడా ఉంది. ఈ కారుపై మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 70వ వార్షికోత్సవ గుర్తు కూడా ఉంటుంది.
‘థార్ 700’ కారు ప్రత్యేకతలివి..
ఉదయ్ పూర్ యువరాజ్ లక్ష్యరాజ్ సింగ్ ఇటీవలే ‘థార్ 700’ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ.9.99 లక్షలు. ఈ కారుకు 5 స్పోక్ అల్లాయ్ వీల్స్, స్పెషల్ కలర్స్, కారు లోపల థార్ లోగోతో రూపొందించిన నల్లని సీట్లు, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) తదితర సౌకర్యాలు ఉన్నాయి. దీనిపై స్పెషల్‌గా రూపొందించిన బ్యాడ్జితోపాటు మిస్టర్ మహీంద్రా సంతకం కూడా ఉంటుంది. బానెట్‌పై డెకల్స్, సైడ్ ఫెండర్స్, బ్లాక్ ఫినిష్డ్ గ్రిల్లె ఉంటాయి.
మేవార్ సంస్థాన మ్యూజియంలోకి ‘థార్ 700’
మేవార్ సంస్థానం మ్యూజియంలో మహీంద్రా ‘థార్ 700’ కారు చోటు దక్కించుకోనున్నది. ఎంతోకాలంగా మేవార్ రాజ కుటుంబం వింటేజ్ కార్ల మ్యూజియం నిర్వహిస్తోంది. ఇందులో రోల్స్ రాయిస్ వారి ఘోస్ట్, కుడిచేతి వాటం డ్రైవింగ్‌కు అనువైన కాడిలాక్ కార్లు రెండు, పలు మెర్సిడెస్ బెంజ్ కార్లు, 1947 షవర్లే బస్, 1950 మారిన్ టైరగ్, ఫోర్డ్ మోడల్ ఏ, 1942 ఫోర్డ్ జీప్ వంటి మోడల్ కార్లు కొలువు దీరి ఉన్నాయి. థార్ 700 కారు 1949 నాటి ఒర్జిన్స్‌ను పోలి ఉంటుంది.
మహీంద్రా అండ్ మహీంద్రా చేతికి ‘మేరు ట్రావెల్స్’
రేడియో టాక్సీ ఆపరేటర్ మేరు ట్రావెల్ సొల్యూషన్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) 55 శాతం వాటాలను చేజిక్కించుకుంది. రూ. 201.50 కోట్ల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించి ఈ వాటాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మేరు ట్రావెల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో దశల వారీగా 55 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు షేర్ సబ్‌స్ర్కిప్షన్, షేర్ హోల్డింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు మహీంద్రా తెలిపింది.
తొలి దశ పెట్టుబడుల తర్వాత ‘మేరు ట్రావెల్స్’లో ఎంఎం డైరెక్టర్
తొలి దశ పెట్టుబడుల అనంతరం మేరు బోర్డులో డైరెక్టర్లను నియమించుకునే హక్కు మహీంద్రాకు ఉండనుందని పేర్కొంది. అంతేకాకుండా కంపెనీకి అనుబంధ సంస్థగా మేరు ఉండనుందని ఎం అండ్ ఎం తెలిపింది. మేరు ట్రావెల్ అనుబంధ సంస్థలైన మేరు మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీ-లింక్ ఆటోమోటివ్ సర్వీసెస్, వీ-లింక్ ఫ్లీట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా మహీంద్రా అనుబంధ సంస్థలుగా మారనున్నాయని వెల్లడించింది.
మేరు ట్రావెల్స్ వాటా దారుల నుంచి షేర్ల కొనుగోలుకు వెసులుబాటు
ఈ ఒప్పందంలో భాగంగా మేరులో ప్రస్తుతమున్న వాటాదారుల నుంచి వాటాలను కొనుగోలు చేసే వెసులుబాటు కూడా మహీంద్రాకు ఉంటుందని తెలిపింది. 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన మేరు.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 156.60 కోట్ల కన్సాలిడేటెడ్ రెవెన్యూను ఆర్జించింది.