మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

By telugu teamFirst Published Sep 16, 2019, 1:04 PM IST
Highlights

మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

14.9.2019 నుంచి 28.9.2019 వరకు మహాలయ పక్షాలు. భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.

పితృదేవతలకు.... ఆకలా...?

అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః

అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే... పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..

తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?

అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి? వారి గతి అధోగతేనా? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారాకానీ, ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు, వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువిం వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు, పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం, పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది.  పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?

సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాల అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.

క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.

భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర, పెట్టి  సత్కరించి పంపాలి.

చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.

ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వల్ల కానీ, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.

డా.ఎస్.ప్రతిభ

click me!