
అట్లతద్దె మన తెలుగువారి సంప్రదాయము. "అట్ల తద్ది ఆరట్లు..ముద్దపప్పు మూడట్లు" అంటూ పాటలు పాడుతూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగుపొరుగు వారికి వాయినాలిస్తూఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూంటారు. ఎంతో సందడిగా జరిగే ఈ పండగను (Atla Tadde) మహిళలను చాలా ఆనందంగా జరుపుకుంటారు. అయితే అట్ల తద్ది అంటే కేవలం నోము నోచుకుని గౌరి పూజ చేసుకుని, వాయినాలు ఇవ్వటమేనా, అట్లు తినటమేనా...ఈ అట్ల తద్ది వెనక ఏదైనా జ్యోతిష్య విశేషం ఉందా ..అంటే ఉందనే చెప్పాలి... ఈ రోజు విశేషాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
అట్ల తద్ది లో అట్లదే ముందు మాట. అట్లకింత శక్తి ఏమిటి? అని చూస్తే...అట్లతద్దె స్వరూపం ఎంత గొప్పదో అర్దమవుతుంది. అట్లు వేయటానికి మినప్పిండి, బియ్యప్పిండి కలిపి వాడతారు. స్త్రీలకు కుజదోషం గనుక ఉంటే ఆలస్యంగా పెళ్లవడం, రుతుక్రమంలో సమస్యలు, గర్భధారణలో దోషాలు వాటిల్లుతుంటాయనేది జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న మాట.
ఇక నవగ్రహాల్లోని కుజుడికి మినుముతో చేసిన ఆహార పదార్దాలు అంటే మహా ఇష్టం. అందుకే ఆ అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావు. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలోనూ సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి వేస్తారు కాబట్టి... మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. అందుకే అట్లను వాయనం ఇవ్వడం ద్వారా గర్భ దోషాలు తొలగిపోతాయి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుంది.
అంతేకాదు, చంద్రగ్రహ దోషం ఉన్నవారికి మనశ్శాంతి కరువవుతుంది అనేది తరుచుగా జ్యోతిష శాస్త్రం తెలిసిన వారు చెప్పే మాట. అయితే ఇలా ప్రతీది ప్రతి ఒక్కరికీ వివరించి చెప్పలేరు కాబట్టి... చెప్పినా అందరికీ పూర్తిగా అర్థం కాకపోవచ్చు. అందుకనే పరోక్షంగా ఆ దోష నివారణలకు సంబంధించిన పదార్థాలను నివేదించి వాయనాల రూపంలో దానం ఇస్తే దోషాలు తొలగిపోతాయని మన పెద్దలు ఈ నియమం ఏర్పాటు చేసారు. అలా ఓ ప్రత్యేకమైన సదాశయంతో జరుపుకుంటారీ పండుగ. స్త్రీల శ్రేయస్సు కోసమే అట్లతద్దె అవతరించిందని చెప్పాలి.
ఇవన్ని ఒకెత్తు అయితే.. రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని పీల్చుకున్నట్లవుతుంది. ఉపవాసంతో జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడం ఈ పండుగ అంతరార్థాలలో మరొకటి.
దేవర్షి త్రిలోక సంచారి అయిన నారదముని సూచన మేరకు ఈశ్వరుడిని పతిగా పొందేందుకు గౌరీదేవి మొదటిసారిగా చేసిన వ్రతమే అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రుడి కళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహంతో స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయని శాస్త్రవచనం.
గౌరీ అంటే ఆదిపరాశక్తికి ప్రతిరూపం. ఈ రోజు సాయంత్రం అంటే చంద్రోదయ వేళ ఉమాదేవీ వ్రతం చేస్తారు. మాంగల్యధారణకు ముందు పెళ్లికూతురు గౌరీపూజ చేస్తుంది. ఆ ప్రకారంగా, మాంగల్య సౌభాగ్యదాయిని గౌరీమాత. ఆదర్శ దాంపత్యం గురించి చెప్పే సందర్భంలో, ఆది దంపతులైన శివపార్వతుల ప్రస్తావన వచ్చి తీరుతుంది. ప్రత్యేకించి ఈ వ్రతాన్ని చేయడమంటే గౌరీదేవి అనుగ్రహాన్ని పొందటమే.
పూజా విధానం...
ఈ రోజున ఆడపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు పెట్టుకుంటారు. వేకువ జామునే లేచి అన్నం తింటారు. పప్పు, పులుసు, పచ్చడి, కూర, పెరుగు వేసుకుని అన్నం తింటారు. దీన్నే ఉట్టికింద ముద్ద అంటారు. అట్లతద్దోయ్ ఆరట్లోయ్ , ముద్ద పప్పోయ్ మూడట్లోయ్ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. 11 తాంబూలాలు వేసుకుంటారు, 11 ఉయ్యాలలూగుతారు, 11 రకాల ఫలాలు తింటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీ దేవికి, చంద్రుడికి పూజ చేసి 11 అట్లు చొప్పున నైవేద్యం పెట్టి...మరో పది అట్లు ముత్తైదువుకు వాయనం ఇస్తారు. పదేళ్లు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చెప్పుకుంటే స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)