జ్యోతిష్యం.. ధనానికి మరణానికి ఏంటి సంబంధం..?

By ramya neerukondaFirst Published Oct 29, 2018, 3:56 PM IST
Highlights

తీవ్ర ధననష్టం, గౌరవభంగము, తీవ్ర అనారోగ్యము వ్యక్తి మరణాన్ని కోరుకునేలా కూడా చేస్తాయి.

నిధన శబ్దానికి మరణం అని అర్థం ఉంది. మరణమును కూడ పలు విధాల వర్గీకరించడం జ్యోతిషంలో కనిపిస్తోంది. మరణాన్నివ్వదగినంత దోషం లేనప్పుడు గండం తప్పుతుందనీ, ఆ దోషాన్నింకా తగ్గించుకుంటే గౌరవభంగ మనీ, ఆ దోషం ఇంకా తగ్గితే ఆరోగ్య భంగమనీ, ఆ దోషం ఇంకా తగ్గితే తీవ్ర ధన నష్టమనీ, ఇంకా దోషం తగ్గితే మనో వ్యధ అనీ, దోషం ఇంకా తగ్గితే స్వప్నంలో మరణమనీ అనుభవజ్ఞులు చెపుతూటాంరు.

వీటిలో తీవ్ర ధననష్టం, గౌరవభంగము, తీవ్ర అనారోగ్యము వ్యక్తి మరణాన్ని కోరుకునేలా కూడా చేస్తాయి. అంటే మరణించిన భావన గండం తప్పటంలో ఉంటే మరణించాలనే భావన పై మూడింలో ఉండడం గోచరిస్తూంది. మొత్తం మీద ధనానికి, మరణానికి ఓ విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే ద్వితీయం మారక స్థానం, ధనస్థానం కూడా. చతుర్థం బాగుంటే ఆ భావంలోని విషయాలైన ఆహారం, గృహం, వాహనం, విద్య, తల్లి, మాతృసౌఖ్యం అన్నీ ఉండాలన్న నియమం లేదుగా! ఏ ఒక్కటైనా ఉండవచ్చు, లేదా కొన్ని ఉండవచ్చు.. అగ్రలా ద్వితీయంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఆరోగ్యమో, ధనమో ఇబ్బంది పెట్టవచ్చు. మనో వ్యధ అనేది మిగిలిన వాటికంటే తక్కువదిగా భావించడం కనిపిస్తోంది. అది చూసేవారికి తక్కువదే కావచ్చు. అనుభవించేవారికి అది చాలా ఎక్కువ కదా! శారీరక అనారోగ్యంలో చుట్టూ వారి నుండి వచ్చే సానుభూతి మానసిక అనారోగ్యంలో కరవౌతుంది.

శరీరం ఆరోగ్యంగానే కనిపిస్తూన్నా గుండ్రాయిలా ఉన్నాడు, వాడికేమి రోగము? అని చుట్టూ ఉన్న వారి చేత భావించబడుతూ శరీర ఆరోగ్యం యొక్క సౌఖ్యాన్ని పొందలేక సుఖానుభూతి లేక ఆ జీవి పడే ఇబ్బంది వర్ణనాతీతం. ఈ మానసిక అనారోగ్యమే కొన్ని వేళల ఆత్మహత్యాదులకు ప్రేరకమౌతూండడం గమనిస్తే పైవాటన్నిం కంటే మానసిక అనారోగ్యమెంత బాధాకరమో అవగతమౌతుంది. ఆ కారణాన, శారీరక అనారోగ్యం కంటే మానసిక అనారోగ్యానికే పెద్ద పీట వేయక తప్పదేమో!

ఈ దృక్కోణంలో చంద్ర బలం యొక్క ప్రాధాన్యాన్ని గురించిన అధర్వణ వేదాంగ జ్యోతిష వచనం ప్రముఖ పాత్ర వహిస్తుంది. చంద్రుడు బలహీనంగా ఉంటే తక్కిన గ్రహాలన్నీ బలంగా ఉన్నా ప్రయోజనం లేదు. చంద్రుడొక్కడు బలంగా ఉంటే తక్కిన గ్రహాలన్నీ బలహీనంగా ఉన్నా మంచి జాతకమే అన్న భావన ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి మారకము కంటే ఎక్కువ బాధాకరమైనది మానసిక అనారోగ్యం అని గుర్తించక తప్పదు. 

చితిచింతా ద్వయోర్మధ్యే చింతా హ్యేవ గరీయసీ ... మరణించిన శవాన్ని చితి కాలిస్తే, చింత బ్రతికి ఉన్నంత కాలం కాలుస్తూనే ఉంటుంది కాబట్టి ఆ మానసిక అనారోగ్యాన్ని జయించాలంటే భగవత్‌ స్మరణ ఒక్కటే మార్గం. ధ్యానం ఒక్కటే శరణ్యం. పుణ్య సంపాదనే ధ్యేయంగా ప్రవర్తించినపుడు వ్యక్తి ఆనందంగా మనగలుగుతాడు.

కొన్ని సందర్భాల్లో ఆర్థిక ప్రయోజనాన్ని ఎక్కువగా రక్షించుకుంటూన్నప్పుడు దోషం యొక్క స్థాయి ఆరోగ్యం మీద చూపించడం, అనారోగ్యంగా ఉన్నవాడు ధననష్టాన్ని పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లాటివి గోచరిస్తూటాంయి. అందుకనే అనుభవజ్ఞులైన జ్యోతిష్కులు ధననష్టం పొందిన వ్యక్తిని దోషం డబ్బు రూపంలో పోయింది, బ్రతికి పోయావు అని ధైర్యం చెబుతూటారు. ఈ విషయాలను కూడా జ్యోతిష్కుడు దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉంది.

డా.ఎస్.ప్రతిభ

click me!