ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదా?

By Arun Kumar PFirst Published Dec 6, 2020, 1:36 PM IST
Highlights

ప్రస్తుత సమాజంలో మనకు వినిపించే మాటల్లో ఒకటి ఇంట్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరం వరకు పండగలు చేయకూడదు అని. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం వినబడుతుంది. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ప్రస్తుత సమాజంలో మనకు వినిపించే మాటల్లో ఒకటి ఇంట్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరం వరకు పండగలు చేయకూడదు అని. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని ప్రచారం వినబడుతుంది. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు. దేవతలందరిని ఒక బట్టలో చుట్టి అటక మీద పెట్టేస్తారు. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందకు దింపి శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. 

వాస్తవానికి హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ ఇంట్లో దైవ దీపారాధన జరగదో ఆ ఇల్లు స్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు నివాసమై ఉంటారు. ప్రతి ఇంట్లోను నిత్యం దీపారాధాన అనేది జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11 వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు శుభస్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకానీ ఏడాది పాటు ఇంట్లో దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని చెప్పలేదు. 

నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు బాహ్యంలో చేసి మిగితాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకు ముందు ఏదైతే చేస్తున్నామో అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు. ఇంతకు ముందు రోజూ ఆలయానికి వెళ్తుంటే, సూతకం అయిన తర్వాత కూడా యధావిధిగా ఆలయదర్శనం చేయవచ్చు. 

మనం నిత్యం అర్చించడం వలన మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా బట్టలో చుట్టి పక్కన పెట్టడమే చాలా తప్పు. అది దోషమే కాదు అరిష్టము కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి గానీ ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా వాటిని అన్నిటిని ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. ఈ విషయంలో పూజలు  చేయవచ్చు అనేకంటే చేసి తీరాలి అని చెప్పడం సరైన సమాధనం అవుతుంది.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటనగా గుడికి వెళ్ళవచ్చు కానీ అర్చనలు, ప్రత్యేక పూజలు చేయకూడదు. గృహాప్రవేశాలు, కేశఖండన మొదలగు శుభకార్యాలు ఏమి చేయకూడదు. ఎక్కడ కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టకూడదు. ప్రత్యేకమైన అభిషేకాలు, వ్రతాలు చేయకూడదు. ఏ కుటుంబంలోనైనా ఇంట్లో అందరికంటే పెద్దవారు పోతేనే ఈ నియమాలు వర్తిస్తాయి. ఇంట్లో పెద్దవారు ఉండగా వారికంటే చిన్న వారు పోతే అన్నీ ద్వాదశ దినకర్మ తర్వాత గుళ్ళో నిద్రచేసి వచ్చిన తర్వాత అన్ని యధావిధిగా అన్ని దైవిక కార్యక్రమాలు జరుపుకోవచ్చు. మీకు ఏమైనా ఈ విషయంలో ధర్మ సందేహాలుంటే మీకు అందుబాటులో అనుకూలంగా ఉన్న అనుభవజ్ఞులైన పండితులను అడిగి మీ సందేహాలను నివృతం చేసుకోండి.     

click me!