టీడీపీలో వంగవీటి కలకలం: అసంతృప్తిలో కొనకళ్ల, అవినాష్‌కు చిక్కులు

By Siva KodatiFirst Published Mar 13, 2019, 12:23 PM IST
Highlights

ఎన్నికల వేళ సీట్ల కేటాయింపు కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కొత్త వారు తమ సీటుకు ఎసరు పెడుతుండటంతో పాత నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు

ఎన్నికల వేళ సీట్ల కేటాయింపు కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. కొత్త వారు తమ సీటుకు ఎసరు పెడుతుండటంతో పాత నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.

అధిష్టానం తీరుపై వారు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అన్నటింటిలోకి ప్రధానంగా విజయవాడకు చెందిన కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కుమారుడు, వంగవీటి రాధా టీడీపీలోకి చేరేందుకు సన్నాహలు చేసుకుంటున్నారు.

పార్టీ మార్పుపై సైలంట్‌గా ఉన్న రాధా.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏదో ఒకటి తేల్చాలని సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కృష్ణలంక కరకట్ట భూ వివాదంతో పాటు బందరు పార్లమెంటు టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి... రాధాకు తెలిపారు.

ఈ వ్యవహారం జిల్లా రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపింది. అయితే అంతకు ముందే మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ పేరు ఇప్పటికే ఖరారు కావడం.. చివరి నిమిషంలో రాధకు బందరు ఇస్తానని సీఎం హామీ ఇవ్వడంతో కొననళ్ల ఫైరయ్యారు.

రాధకు బందరు పార్లమెంటు స్థానం కన్ఫమ్ చేసి కొనకళ్లను పెడన అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాను బందరు నుంచే పోటీ చేస్తానని, పెడన నుంచి అసెంబ్లీకి వెళ్లనని కొనకళ్ల ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు.

గత రెండు పర్యాయాలుగా కొనకళ్ల బందరు నుంచి టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందారు. అటువంటి వ్యక్తిని పక్కకుబెట్టడం మంచిది కాదన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బందరు పార్లమెంటు నుంచి వంగవీటి రాధా పోటీ చేస్తే.... గుడివాడ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న దేవినేని అవినాష్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది.

జిల్లా రాజకీయాల్లో రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న కొడాలి నాని .. వంగవీటి రాధాకు అత్యంత ఆప్తమిత్రుడు. మిత్రుడికి వ్యతిరేకంగా ఆయన ఏ విధంగా ప్రచారం చేస్తారన్న దానిపై రాజకీయవ ర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 
 

click me!