మాజీ జేడీ లక్ష్మినారాయణ బాండ్ పేపర్ చెల్లని కాగితమేనా?

By telugu teamFirst Published Apr 8, 2019, 6:22 PM IST
Highlights

వివి లక్ష్మీనారాయణ రాసిచ్చిన బాండ్ పేపర్ చెల్లదనే మాట వినిపిస్తోంది. అందుకు తగిన కారణాలను న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక ఉన్నతమైన పదవిని నిర్వహించిన లక్ష్మినారాయణకు ఆ విషయం తెలియదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

విశాఖపట్నం: జనసేన విశాఖపట్నం లోకసభ అభ్యర్థి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మినారాయణ ఓటర్లకు బాండ్ పేపరు రాసిచ్చారు. తాను ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తానని చెబుతూ ఆ బాండ్ పేపర్ రాసిచ్చారు. దాంతో ఆయన ఒక్కసారిగా ఉన్నత స్థాయిని అక్రమించారు. రాజకీయ నేతల్లో ఒక మెట్టు పైన ఉన్నట్లు ప్రశంసల జల్లు కురిసింది. 

వివి లక్ష్మీనారాయణ రాసిచ్చిన బాండ్ పేపర్ చెల్లదనే మాట వినిపిస్తోంది. అందుకు తగిన కారణాలను న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక ఉన్నతమైన పదవిని నిర్వహించిన లక్ష్మినారాయణకు ఆ విషయం తెలియదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

వంద రూపాయల విలువ చేసే స్టాంప్ పేపరు మీద సంతకం చేసి ఆయన బాండ్ పేపర్ ఇచ్చారు. అందులో ఆయన అద్దె ఇంటి చిరునామా తప్ప మరేం లేదు. ఆధార్ కార్డు నెంబర్ గానీ ఫోన్ నెంబర్ గానీ లేదు. తాను పోటీ చేస్తున్న జనసేన పార్టీ ప్రస్తావన కూడా లేదు. ఇది ఆయన తెలిసి చేశారా, తెలియక చేశారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.న్యాయనిపుణులు చెప్పిన వివరాల ప్రకారం లక్ష్మినారాయణ రాసిచ్చిన బాండ్ పేపరు చెల్లదు.

ఎందుకు చెల్లదు...

స్టాంపు పేపరు మీద రాసిస్తానని ప్రజలకు ఇవ్వజూపడం భారతీయ కాంట్రాక్టు చట్టం ప్రకారం ఒప్పందం కాదు. అంతేకాకుండా పూర్తి కొత్తవారితో ఒప్పందం కుదుర్చుకోవడం కుదరదు. పేరు, చిరునామా, ఇతర వివరాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు లేదా పక్షాల మధ్య మాత్రమే ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలుంటుంది. ఇలాంటి లక్షణం వీవీ లక్ష్మినారాయణ రాసిన బాండ్ పేపరుకు లేదు. 

ఒప్పందానికి మూలమైన ప్రతిఫలం ఏమిటో తెలుపనందున అది ఒప్పందం కాదని న్యాయనిపుణులు అంటున్నారు. ప్రతిఫలం పరిమాణం ఎంతో తెలియకుిండా 100 రూపాయల న్యాయేతర స్టాంపు పేపరు వాడాలని ఎలా నిర్ణయించారనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. 

మిథిలేష్ కుమార్ వర్సెస్ భారత ఎన్నికల సంఘం కేసులో సుప్రీంకోర్టు ప్రకటించిన నిర్ణయం ప్రకారం దాన్ని అమలు పరచడం సాధ్యం కాదు. దానికి హేతుబద్దత లేదు. ఎన్నికల ప్రణాళికలను అమలు చేయాలని ఏ పార్టీపైన కూడా ఒత్తిడి తేలేమని ఓ కేసులో ఇదివరకు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 

మిథిలేష్ కుమార్ పాండేకు, భారత ఎన్నికల సంఘానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఉంది.

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ప్రణాళికలో చేర్చే హామీల విషయంలో రాజకీయ పార్టీలకు ఉన్న అధికారని అదుపు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రణాళికలో ఏ విధమైన హామీలు ఇవ్వాలని, ఎలాంటి హామీలు ఇవ్వకూడదు అని శాసించడం కోర్టుల పనికాదని స్పష్టం చేసింది. 

ఇలాంటి పరిస్థితిలో వివి లక్ష్మినారాయణ ఓటర్లకు రాసిచ్చిన బాండ్ పేపరు చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. 

click me!