చంద్రబాబుకు షాక్, టీడీపీకి కాకినాడ ఎంపీ తోట నర్సింహం గుడ్ బై : రేపు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం

By Nagaraju penumalaFirst Published Mar 12, 2019, 6:37 PM IST
Highlights

తాను తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశానని తోట నర్సింహం చెప్పారు. అయితే టీడీపీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. 
 

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి రాజీనామా చేశారు. ఆ షాక్ నుంచి కోలుకోకముందే కాకినాడ ఎంపీ తోట నర్సింహం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. 

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న తోట నర్సింహం ఇక సైకిల్ దిగాలని నిర్ణయించుకున్నారు. బుధవారం వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు. 

తాను తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశానని తోట నర్సింహం చెప్పారు. అయితే టీడీపీ తనను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. 

ఇకపోతే తోట నర్సింహం ఇటీవలే తన భార్య వాణితో కలిసి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. అనారోగ్యం కారణంగా ఈసారి పార్లమెంట్ కు పోటీ చెయ్యలేనని స్పష్టం చేశారు. తన భార్యకు కానీ తనకు గానీ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. 

తన భార్యకు పెద్దాపురం అసెంబ్లీ లేకపోతే తనకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరారు. అయితే అందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించకపోవడంతో తోట నర్సింహం అలిగారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఇక తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పాలని బుధవారం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

తోట వాణి రాబోయే ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏపీ హోంశాఖమంత్రి, డిప్యూటీసీఎం నిమ్మకాయల చినరాజప్ప మరోసారి పోటీ చెయ్యబోతున్నారు. 

ఇదే పెద్దాపురం నియోజకవర్గం నుంచి తోట వాణి కూడా పోటీ చెయ్యనున్నారని ప్రచారం జరుగుతుంది. తోటవాణికి పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు వైఎస్ జగన్ సుమఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తోట వాణి మాజీమంత్రి దివంగత నేత మెట్ల సత్యనారాయణ కుమార్తె. 


 

click me!