డమ్మీ అంటే తాట తీస్తా: గల్లా జయదేవ్ కు ఒకప్పటి మిత్రుడు, జనసేన ఎంపీ అభ్యర్థి వార్నింగ్

By Nagaraju penumalaFirst Published Mar 20, 2019, 3:05 PM IST
Highlights

 గుంటూరు పార్లమెంట్‌ కోసం వందల కోట్లు ఖర్చు చేయడానికి జయదేవ్‌, మోదుగుల సిద్ధమయ్యారని విమర్శించారు. వారు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా విజయం మాత్రం జనసేనదేనన్నారు.  జయదేవ్, మోదుగులను ఓడిస్తానని తెలిపారు. ఎన్నికల అనంతరం వారిని చిత్తూరు, బెంగళూరుకు పంపిస్తానన్నారు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.
 

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం హీటెక్కిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయి నుంచి తాట తీస్తా అనేంత వరకు వెళ్లిపోయింది ఎన్నికల ప్రచారం. 

తాజాగా గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి బోనబోయి శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆ విషయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. 

టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ తనను డమ్మీ కేండిడేట్ అంటూ వ్యాఖ్యలు చేశారని, వదంతులు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. అలాంటి వాళ్ల తాట తీస్తానని హెచ్చరించారు. మరోవైపు టీడీపీ, వైసీపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఆ రెండు పార్టీలు బీసీలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. 

గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని జనసేన కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్‌ కోసం వందల కోట్లు ఖర్చు చేయడానికి జయదేవ్‌, మోదుగుల సిద్ధమయ్యారని విమర్శించారు. 

వారు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా విజయం మాత్రం జనసేనదేనన్నారు.  జయదేవ్, మోదుగులను ఓడిస్తానని తెలిపారు. ఎన్నికల అనంతరం వారిని చిత్తూరు, బెంగళూరుకు పంపిస్తానన్నారు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.

ఇకపోతే రెండు రోజుల క్రితం బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగారు. అంతేకాదు గత ఎన్నికల్లో గల్లాజయదేవ్ గెలుపులో కీలక పాత్ర పోషించారని టాక్.   

click me!