
చిత్తూరు:పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు. అధిక డోసేజ్‌లో మత్తు ఇంజక్షన్ చేసుకోవడంతో పాటు మణికట్టు వద్ద కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. జగన్ అన్నా ఈ నిందలు భరించలేక పోతున్నా.. చనిపోతున్నా అంటూ సెల్పీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొద్దిసేపటికే సునీల్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
గత ఎన్నికల్లో పూతలపట్టు నుండి సునీల్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ దఫా సునీల్ కు టిక్కెట్టు దక్కదని ప్రచారం సాగుతోంది. నాలుగు రోజుల క్రితం లోటస్‌పాండ్‌కు వచ్చిన సునీల్ కు జగన్ నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి లభించలేదు. దీంతో సునీల్ మనస్తాపానికి గురయ్యాడు.
తనపై ఎంత రాజకీయ ఒత్తిడులు వచ్చినా పార్టీకి విధేయుడుగా ఉన్నప్పటికీ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సునీల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆత్మహత్యాయత్నానికి ముందు సునీల్ ఓ సెల్ఫీ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో దీనిని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఐ ఈదురుబాషా, ఎస్‌ఐ చంద్రమోహన్ హు టాహుటిన సిబ్బందితో కలసి పలమనేరులోని సునీల్ ఇంటికి చేరుకున్నారు.ఇంటికి తాళాలు వేసి ఉండడంతో సునీల్‌కు ఫోన్ చేశారు. ఫోన్ మమతారాణి తీసుకొని తాము క్షేమంగానే ఉన్నామని సమాధానం చెప్పి ఫోన్ కట్ చేసేశారు.
స్థానికుల సమాచారం మేరకు ఓ చర్చిలో సునీల్ ఉన్నట్లు తెలుసుకుని, అక్కడకు వెళ్లి పరిశీలించగా అక్కడ సునీల్ ఎడమచేతి మణికట్టు వద్ద బ్యాండేజ్ కట్టి ఉండడంతో పాటు సెలైన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన క్యాన్‌లా కుడి చేతికి ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయత్నాన్ని సునీల్ భార్య అడ్డుకున్నారు. తాను డాక్టర్‌నని, వైద్యం చేసుకుంటానని బదులివ్వడంతో పోలీసులు వెనుదిరిగి అక్కడ కాపలా ఏర్పాటు చేశారు.