అంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది, చంద్రబాబూ?: వైఎస్ విజయమ్మ ఫైర్

By Nagaraju penumalaFirst Published Apr 5, 2019, 5:13 PM IST
Highlights

ఇసుక అక్రమతవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కార్ పై రూ.100కోట్లు ఫైన్ విధించడం సిగ్గు చేటన్నారు. అంతకన్నా సిగ్గు చేటు ఏముంటుంది చంద్రబాబు అంటూ వైఎస్ విజయమ్మ నిలదీశారు. 
 

చిత్తూరు: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ. రాష్ట్రంలో ఇసుక, మట్టిని టీడీపీ నేతలు దోచేశారని ఆమె ఆరోపించారు. 

ఇసుక అక్రమతవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కార్ పై రూ.100కోట్లు ఫైన్ విధించడం సిగ్గు చేటన్నారు. అంతకన్నా సిగ్గు చేటు ఏముంటుంది చంద్రబాబు అంటూ వైఎస్ విజయమ్మ నిలదీశారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్ విజయమ్మ పూతలపట్టు వైసీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబు, చిత్తూరు ఎంపీ అభ్యర్థి నల్లకొండగారి రెడ్డప్పలకు మద్దతుగా ప్రచారం చేశారు. 

ఎంఎస్ బాబు, రెడ్డప్పలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వెయ్యాలని కోరారు. వైసీపీ అధికారంలోకి రాగానే 108 అంబులెన్స్‌ కూతలు మళ్లీ వినిపిస్తాయని, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని వైఎస్ విజయమ్మ హామీ ఇచ్చారు. 

ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాటం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆమె గుర్తు చేశారు. 25 ఎంపీ స్థానాలు గెలిపించండి ప్రత్యేక హోదా సాధించుకుందామని పిలుపునిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక చిత్తూరు జిల్లాలోని సహకార చక్కెర ఫ్యాక్టరీలను మూసేయించారని ఆరోపించారు. 

హెరిటేజ్ డైరీ లబ్ధికోసం విజయ డైరీని సైతం మూసివేశారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని, మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. ఎన్నికలవేళ పసుపు-కుంకుమ పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

2 రూపాయలకు 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్లు కంటే మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు. 

వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులను వైఎస్ఆర్ 80శాతం పూర్తి చేస్తే మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చెయ్యలేకపోయారని వైఎస్ విజయమ్మ విమర్శించారు.  

click me!