జబర్దస్త్: పవన్, నాగబాబులకు తారల సైదోడు

By Nagaraju penumalaFirst Published Apr 5, 2019, 4:17 PM IST
Highlights

ఈ భీమవరం నియోజకవర్గం కూడా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే కావడంతో సినీ నటులు సందడి చేస్తున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ లను గెలిపించాలంటూ సినీ ఇండస్ట్రీలోని కొందరు నటులు రంగంలోకి దిగారు. దీంతో ఈ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రోజుకో నటుడు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

నరసాపురం: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయంటే చాలు అందరిచూపు ఉభయగోదావరి జిల్లాలవైపే. ఉభయగోదావరి జిల్లాలో అత్యధిక సీట్లు ఎవరు గెలిస్తే వారిదే అధికారం అన్నది ఓ సెంట్ మెంట్. 

అందుకోసమే అన్ని రాజకీయ పార్టీలు ఈ జిల్లాపైనే ప్రత్యేక దృష్టిసారిస్తుంటాయి. ప్రతీ ఎలక్షన్స్ మాదిరిగానే ఈ ఎలక్షన్ సందర్భంగా అందరి చూపు ఉభయగోదావరి జిల్లాలపై పడింది. ఎన్నికలు రాకముందే ఆంధ్రప్రదేశ్ అంతటా నరసాపురం పార్లమెంట్ పేరు మార్మోగిపోతుంది. 

ఎందుకంటే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున మెగాస్టార్ చిరంజీవి సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

ఈ భీమవరం నియోజకవర్గం కూడా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే కావడంతో సినీ నటులు సందడి చేస్తున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ లను గెలిపించాలంటూ సినీ ఇండస్ట్రీలోని కొందరు నటులు రంగంలోకి దిగారు. 

దీంతో ఈ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో రోజుకో నటుడు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ ను చుట్టేస్తున్నారు. ఇకపోతే నాగబాబు తరపున ఆయన తనయ హీరోయిన్ నిహారిక సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. 

తన తండ్రిని గెలిపించాలంటూ నియోజకవర్గ ప్రజలను కోరారు. పశ్చిమగోదావరి జిల్లాతో మెగా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని ఈ జిల్లా తమ సొంత జిల్లా అంటూ చెప్పుకొచ్చారు. తన తండ్రి నాగబాబును, భీమవరం అసెంబ్లీ అభ్యర్థి బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని కోరారు. 

మరోవైపు నాగబాబు సతీమణి కొణిదెల పద్మజ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులతో కలిసి ఆమె నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 

ఇకపోతే జబర్దస్త్ ఫేమ్ లు చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, దొరబాబు, రాజు, రాఘవ, రామ్ ప్రసాద్ వంటి నటులు సైతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరిగి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. 

జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి నాగబాబుకు, భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు ఓటెయ్యాలని కోరుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. తాజాగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సైతం ఎన్నికల ప్రచారంలో దిగిపోయారు. 

తన తండ్రి నాగబాబు, బాబాయ్ పవన్ కళ్యాణ్ ల గెలుపును కోరుతూ నరసాపురం పార్లమెంట్ పరిధిలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీకి ఓటెయ్యాలంటూ కోరుతున్నారు. గాజు గ్లాస్ కు ఓటేసి జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. 

మెుత్తానికి ఎన్నికల పుణ్యమా అంటూ నాగబాబు కుటుంబం మెుత్తం నరసాపురం పార్లమెంట్ లో హల్ చల్ చేస్తోంది. ఇకపోతే నేడో రేపో స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ సైతం మెగాబ్రదర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ప్రచారం నడుస్తోంది. 

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లు దాదాపు ఎన్నికల ప్రచారానికి దూరమైన నేపథ్యంలో బన్నీ తప్పక వస్తారని జనసేన పార్టీ కార్యకర్తలు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


 

click me!