నేడు పులివెందులకు వైఎస్ విజయమ్మ: రేపట్నుంచి ఎన్నికల ప్రచారం

By Nagaraju penumalaFirst Published Mar 28, 2019, 7:47 AM IST
Highlights

అనంతరం మార్చి 29 నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. మార్చి29 శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు వైఎస్ విజయమ్మ. 

విజయవాడ: ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎన్నికల ప్రచార సభలపేరుతో దూసుకుపోతున్నారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను సైతం ఎన్నికల ప్రచార బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బస్సుయాత్ర చేపట్టబోతున్నారు. 

విజయమ్మ బస్సుయాత్రకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 28 అంటే గురువారం వైఎస్ విజయమ్మ పులివెందుల చేరుకుంటారు. అక్కడ ఇడుపులపాయలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ లో నివాళులర్పిస్తారు. 

అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చెయ్యనున్నారు. అనంతరం మార్చి 29 నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేపట్టనున్నారు. ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. 

మార్చి29 శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు వైఎస్ విజయమ్మ. కందుకూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలలో ఆమె పర్యటించనున్నారు. 

మార్చి 30 శనివారం అదే జిల్లాలోని ఎర్రగొండపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నాం నుంచి గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పర్యటిస్తారు. మార్చి31 ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలలో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారని ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. 
 

click me!