ఈసీని కూడా బెదిరించారు, సిగ్గుపడాలి: చంద్రబాబుపై జగన్ ఫైర్

By telugu teamFirst Published Apr 11, 2019, 8:48 PM IST
Highlights

ఓటమి పాలవుతున్నారని తెలిసి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి ఎన్నికల కమిషన్ ను బెదిరిస్తున్నారని జగన్ అన్నారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలు దేవుని దయ, ప్రజల ఆశీస్సులు అని ఆయన అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఓడిపోతున్నారని తెలిసి చంద్రబాబు ఎన్నికల కమిషన్ ను కూడా బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి అలా ప్రవర్తిస్తున్నందుకు సిగ్గుపడాలని ఆయన అన్నారు. 

ఓటమి పాలవుతున్నారని తెలిసి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి ఎన్నికల కమిషన్ ను బెదిరిస్తున్నారని జగన్ అన్నారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలు దేవుని దయ, ప్రజల ఆశీస్సులు అని ఆయన అన్నారు. ఓడిపోతున్నారు కాబట్టి బురద చల్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. 

నెల్లూరు, గురజాలల్లో తమ పార్టీ కార్యకర్తలపై టీడీపివారు దాడులు చేశారని, తమ కార్యకర్తలు ఇద్దరు మరణించారని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చంద్రబాబు ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారని, ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుయుక్తులు పన్నారని ఆయన అన్నారు. 

అయినా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగులో పాల్గొని ప్రాజస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రయత్నించారని ఆయన చెప్పారు. ప్రజలకు కృతజ్ఞతలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. పార్టీ తరఫున నిలబడిన ప్రతి కార్యకర్తకూ నాయకుడికీ అభినందిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

నారా లోకేష్ యధేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన అనుచరులతో పోలింగ్ కేంద్రంలోకి చొరబడ్డారని ఆయన విమర్శించారు. పత్తిపాటి పుల్లారావు పోలింగ్ సిబ్బందిని బెదిరించారని ఆయన ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన పలు సంఘటనలను ఆయన వివరించారు. 

click me!