నా ప్రమాణ స్వీకారం తేదీని దేవుడే నిర్ణయిస్తాడు: వైఎస్ జగన్

By telugu teamFirst Published Apr 12, 2019, 6:28 PM IST
Highlights

కేసీఆర్‌తో దోస్తీపై ఎన్నిసార్లు చెప్పాలని జగన్ మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. ఆ విషయంలో తిరుపతి సభలోనే తాను స్పష్టమైన ముగింపు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ గెలుస్తుందని, తన ప్రమాణ స్వీకారం తేదీని దేవుడే నిర్ణయిస్తాడని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో పోలింగ్‌ ముగిసిన తర్వాత గురువారం రాత్రి ఆయన విజయసాయిరెడ్డితో కలిసి హైదరాబాద్‌ లోట్‌సపాండ్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

కేసీఆర్‌తో దోస్తీపై ఎన్నిసార్లు చెప్పాలని జగన్ మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. ఆ విషయంలో తిరుపతి సభలోనే తాను స్పష్టమైన ముగింపు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సాయంత్రం 5గంటల ప్రాంతంలో జగన్‌, తన తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతి, కుటుంబ సభ్యులు కడప నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు.

ఈ ఎన్నికల్లో తమకు 140 అసెంబ్లీ స్థానాలు, 20 ఎంపీ స్థానాలు వస్తాయని జగన్‌ సోదరి షర్మిల చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే ఉద్యమం బతికి ఉందంటే దానికి జగనే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె పులివెందులలో తన భర్తతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. 

click me!