ఆనాటి బంధం ఈనాడు తేలింది: మాజీ జేడీ లక్ష్మీనారాయణపై అంబటి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 12, 2019, 1:47 PM IST
Highlights

చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ రహస్యంగా మాట్లాడుకుంటున్నారని, కాల్ డేటా బయటకు తీయాల్సిందిగా ఆరోజు వైసీపీ డిమాండ్ చేసిందని రాంబాబు గుర్తుచేశారు.

జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కాలనే దురుద్దేశ్యంతో చంద్రబాబు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కేసులు పెట్టాయన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జేడీ లక్ష్మీనారాయణ లోటస్‌పాండ్‌లో తనిఖీలు చేసి జగన్‌ను 16 నెలల పాటు జైలులో పెట్టారన్నారు.

జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ మీడియా అద్బుతమైన ప్రచారం కల్పించిందని.. ఊరూరా ఫ్లెక్సీలు కట్టారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ రహస్యంగా మాట్లాడుకుంటున్నారని, కాల్ డేటా బయటకు తీయాల్సిందిగా ఆరోజు వైసీపీ డిమాండ్ చేసిందని రాంబాబు గుర్తుచేశారు.

జేడీ లక్ష్మీనారాయణ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన జనసేన, లోక్‌సత్తాలలో చేరుతున్నట్లు యెల్లో మీడియా ప్రచారం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు చంకనెక్కి తెలుగుదేశం పార్టీలో లక్ష్మీనారాయణ చేరబోతున్నారంటే ఏ నాటి బంధమోనని అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీడీపీకి దగ్గరవ్వడం ద్వారా లక్ష్మీనారాయణ నిజస్వరూపం బయటపడిందన్నారు. జగన్ జైలులో ఉన్నప్పటికి విజయమ్మ, షర్మిలమ్మ పార్టీని ముందుకు నడిపించారని రాంబాబు గుర్తుచేశారు.

జగన్‌పై విచారణను యెల్లో మీడియాలో ఉన్నది ఉన్నట్లు వచ్చేదని.. దీనికి సంబంధించిన సమాచారమంతా సీబీఐ కార్యాలయం నుంచే వచ్చేదని రాంబాబు ఆరోపించారు. చంద్రబాబును మోయ్యటం కోసం, టీడీపీని కాపాడటం కోసం ఆ రెండు పత్రికలు ఎంతకైనా తెగిస్తాయన్నారు.     

click me!