ఏపీలో పోటీ చెయ్, నీ కనుసైగలతో నడిచే జగన్ ను కాదు: కేసీఆర్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Mar 23, 2019, 6:10 PM IST
Highlights

కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

నూజివీడు‌: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నకేసీఆర్ ఏపీకి వచ్చి పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. చంద్రబాబుపై కోపంతోనే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామంటూ టీఆర్ఎస్ నేతలు అంటున్నారని వ్యాఖ్యానించారు. 

కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలిస్తే కేసీఆర్‌ గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థి గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

వరంగల్‌లో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్లు రాళ్లతో కొట్టి తరిమారని పవన్‌ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పౌరుషం లేదా? తెలంగాణ నేతలకు బానిసలమా అంటూ నిలదీశారు. 

ప్రతిపక్ష నేతగా ఐదేళ్ల పాటు ఏమీ చేయని జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఇంకేం చేస్తారని నిలదీశారు. నూజివీడును ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. నూజివీడులో అంతర్జాతీయ మామిడి పండుగ చేద్దామని, స్పెయిన్‌లో టమాటో పండుగలా నూజివీడు అంటే మామిడి పళ్లు గుర్తుకు రావాలని స్పష్టం చేశారు. 

జనసేన అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలకు డొక్కా సీతమ్మ, కందుకూరి, కాటన్‌ దొర, అంబేడ్కర్‌ వంటి మహనీయుల పేర్లు పెడతామని స్పష్టం చేశారు. తన పేరుపై భవిష్యత్తులో ఒక్క పథకం పేరు కూడా ఉండబోదని తెలిపారు. డబ్బుతో సంబంధం లేని రాజకీయాలు చేద్దాం రండి అంటూ ప్రజలకు పవన్‌ పిలుపునిచ్చారు.

పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకే జనసేన పుట్టిందని పవన్‌ స్పష్టం చేశారు. జగన్‌ ఐదుగురితో ఎన్నికల ఖర్చు పెట్టించి ఒక్కరికి టికెట్‌ ఇస్తారని విమర్శించారు. అభ్యర్థులను చెరకు రసం పిండినట్టు పిండుతున్నారని వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ప్రతిపక్ష నేతకు పాదయాత్ర పేరుతో రోడ్లమీద తిరగడమే తెలుసని శాసనసభకు వెళ్లడం తెలియదన్నారు. పరిశ్రమలు రావాలంటే వాటాలు అడిగే పరిస్థితి వైసీపీ నేతలదని మండిపడ్డారు. 

నూజివీడును పులివెందుల నుంచి ఆపరేట్‌ చేసే దౌర్భాగ్యం ఇక్కడి ప్రజలకు రాకూడదన్నారు. కేసీఆర్‌ కనుసైగలతో నడిచే జగన్‌లాంటి నేతను తాను కాదన్నారు పవన్ కళ్యాణ్. వైసీపీని గెలిపిస్తే మనల్ని ద్రోహులని తిట్టిన టీఆర్ఎస్ ని గెలిపించినట్టేనని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. 
 
రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం అవుతున్నా ప్రమాణస్వీకారం చేస్తానన్నారు. రాజకీయాల్లో నాకు రూపాయి అవసరం లేదు జగన్‌లా కేసీఆర్‌ కనుసన్నల్లో పని చేసే వ్యక్తిని కాదన్నారు.  
 

click me!