నేను మగాడ్ని: జగన్, చంద్రబాబులపై విరుచుకుపడిన పవన్

By Nagaraju penumalaFirst Published Apr 2, 2019, 3:33 PM IST
Highlights

కేసీఆర్ బిస్కెట్లు పడేస్తే జగన్ తీసుకుంటారేమో కానీ తనకు అత ఖర్మపట్టలేదన్నారు. మరోవైపు సైకిల్ చైన్ తెగిపోయి చాలా కాలం అయ్యిందన్నారు. ప్రస్తుతం స్టాండ్ వేసి తొక్కుకుంటున్నారని విమర్శించారు. 2018లో వారి అవినీతిని చూసి సైకిల్ చైన్ తెంచేశారని తెలిపారు. 

తణుకు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ దుర్మార్గులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరూ కంసుడులా తయారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ లు కలిసే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. చంద్రబాబు, వైఎస్ జగన్ కంసుడులు అయితే తాను కృష్ణుడు అంటూ చెప్పుకొచ్చారు. తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో తన నిర్ణయమని చెప్పుకొచ్చారు. 

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచెయ్యాలని తెలంగాణకు చెందిన నాయకులు సూచించారని తెలిపారు. తాను ఏ పార్టీతో వెళ్లాలో, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో అది తన ఇష్టమని తెలిపారు. అలాంటిది తెలంగాణ నాయకులు ఒత్తిడి పెడితే ఎలా అంటూ ప్రశ్నించారు. 

వైసీపీతో కలిసి వెళ్లేది లేదన్నారు. వైసీపీ వాళ్లకి కుళ్లు ఎక్కువ అని అందుకే పొత్తు పెట్టుకోలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని ఆ పార్టీ భావిస్తోందని తెలిపారు. ఏ పవన్ కళ్యాణ్ కాకూడదా అని నిలదీశారు. 

రాజకీయం అంటే నారావారి ఇంట, వైఎస్ ఇంట మాత్రమే ఉండాలా అంటూ ప్రశ్నించారు. మీ కుటుంబంలో వాడే ముఖ్యమంత్రిగా ఉండాలా అంటూ నిలదీశారు. 2009లో పీఆర్పీ వచ్చినప్పుడు కూడా ఈ దుర్మార్గులు ఇద్దరూ పనికిమాలిన విమర్శలు చేసి ప్రజారాజ్యంపై తప్పుడు ప్రచారం చేశారని విరుచుకుపడ్డారు. 

ప్రజల కోసం తాము కోట్లు వదులుకుంటే, టికెట్లు అమ్ముకున్నది వైఎస్ జగన్ అంటూ విరుచుకుపడ్డారు. తాను మగాడినని ఏం మాట్లాడినా దమ్మున్నోడిగా డైరెక్ట్ గా మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రావాళ్ల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కు తాకట్టు పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ మండిపడ్డారు. 

కేసీఆర్ బిస్కెట్లు పడేస్తే జగన్ తీసుకుంటారేమో కానీ తనకు అత ఖర్మపట్టలేదన్నారు. మరోవైపు సైకిల్ చైన్ తెగిపోయి చాలా కాలం అయ్యిందన్నారు. ప్రస్తుతం స్టాండ్ వేసి తొక్కుకుంటున్నారని విమర్శించారు. 2018లో వారి అవినీతిని చూసి సైకిల్ చైన్ తెంచేశారని తెలిపారు. 

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. మర్యాదను కాపాడుకోవాలని హితవు పలికారు. పిచ్చి వాగుడు వాగే వాళ్లకి చెప్తున్నా ఆ వాగుడు కట్టిపెట్టాలని సూచించారు. మీరు హద్దు మీరితే అవసరం అయితే తాట తీసి కూర్చోబెడతానని హెచ్చరించారు.  

click me!