ముందే పరిటాల శ్రీరామ్ డీలా: కౌంటింగ్ కేంద్రానికి దూరం

By telugu teamFirst Published 24, May 2019, 2:42 PM IST
Highlights

రాప్తాడులో గురువారం ఉదయం నుంచే వైసీపీ గాలీ వీస్తూ వచ్చింది. దాంతో ప్రకాష్ రెడ్డి.. కౌంటింగ్‌ కేంద్రం వద్దనే ఉండిపోయారు. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ మాత్రం కౌంటింగ్‌ కేంద్రం వద్దకు కూడా రాలేదు.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ రాప్తాడు అభ్యర్థి పరిటాల శ్రీరామ్ గురువారంనాడు కౌంటింగ్ కేంద్రం వద్దకు కూడా రాలేదు. తన ఓటమి తప్పదని భావించే ఆయన కౌంటింగ్ కేంద్రానికి రాలేదని భావిస్తున్నారు. తల్లి పరిటాల సునీతను కాదని పరిటాల శ్రీరామ్ రాప్తాడు తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకున్నారు. కానీ, ఎన్నికల్లో డీలా పడ్డారు. 

పరిటాల శ్రీరామ్ పై వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు 25,575 ఓట్ల మెజారిటీ వచ్చింది.  2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లో ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డికి పోటీగా పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ బరిలో నిలిచారు. 

రాప్తాడులో గురువారం ఉదయం నుంచే వైసీపీ గాలీ వీస్తూ వచ్చింది. దాంతో ప్రకాష్ రెడ్డి.. కౌంటింగ్‌ కేంద్రం వద్దనే ఉండిపోయారు. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ మాత్రం కౌంటింగ్‌ కేంద్రం వద్దకు కూడా రాలేదు. ప్రకాష్ రెడ్డి సాయంత్రం వరకు అక్కడే ఉండి, గెలుపొందిన తరువాత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నాగేశ్వరరావు నుంచి డిక్లరేషన్‌ పత్రాన్ని అందుకున్నారు. 

రాప్తాడు నియోజకవర్గ ఎన్నికల ఫలితాల్లో రెండు రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్లలో వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. జనసేన, బీజేపీ, ఇతరులు అన్ని రౌండర్లలోనూ డబుల్‌ డిజిటిక్‌ పరిమితమయ్యారు. 

Last Updated 24, May 2019, 2:42 PM IST