నాలుగు ఎన్నికలు.. ఒకేసారి రెండు స్థానాల్లో పోటీ: ఎన్టీఆర్ రికార్డు

By Siva KodatiFirst Published Apr 10, 2019, 10:46 AM IST
Highlights

రెండు చోట్లా పోటీ చేయడంతో పాటు పోటీ చేసిన ప్రతీ చోటా గెలవడం ఒక రికార్డు. అలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్

ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఒకేసారి రెండు స్థానాల్లో పోటీ చేయడం గురించి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్లా పోటీ చేస్తున్నారు.

ఒకటి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కాగా, రెండోది విశాఖ జిల్లా గాజువాక. ప్రస్తుతం ఈ రెండు స్థానాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఆయన రెండు స్థానాల్లో గెలుస్తారా లేక చిరంజీవిలా ఒక చోట గెలిచి, మరో చోట ఓడిపోతారా...? అంటూ విపరీతమైన చర్చతో పాటు భారీ ఎత్తున బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.

రెండు చోట్లా పోటీ చేయడంతో పాటు పోటీ చేసిన ప్రతీ చోటా గెలవడం ఒక రికార్డు. అలాంటి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్. 1983లో తొలిసారి గుడివాడ, తిరుపతి నుంచి పోటీ చేసిన రామారావు రెండు చోట్లా గెలిచారు. గుడివాడ సీటును ఉంచుకుని తిరుపతికి రాజీనామా చేశారు.

1985లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశ్యంతో కోస్తాలో గుడివాడ, రాయలసీమలో హిందూపురం, తెలంగాణలో నల్గొండ నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ గెలిచారు. హిందూపురాన్ని ఉంచుకుని గుడివాడ, నల్గొండ సీట్లకు రాజీనామా చేశారు.

1989 ఎన్నికల్లో ఓటర్లు ఎన్టీఆర్‌కు షాకిచ్చారు. హిందూపురంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో పోటీ చేసిన ఆయన హిందూపురంలో గెలవగా... కల్వకుర్తిలో కాంగ్రెస్ నేత జె.చిత్తరంజన్‌దాస్‌ చేతిలో ఓడిపోయారు.

1994 ఎన్నికల్లో హిందూపురంతో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి పోటీ చేసి రెండింట్లోనూ గెలిచారు. హిందూపురం ఉంచుకుని టెక్కలికి రాజీనామా చేశారు.

click me!