నిజమైన సెంటిమెంట్: మంత్రులైన కృష్ణానేతలకు ఓటమి తథ్యం..!!!

By Siva KodatiFirst Published May 24, 2019, 11:42 AM IST
Highlights

జిల్లాలకు జిల్లాలను ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట వంటి కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఫలితాలు పచ్చ శ్రేణులకు షాకిచ్చాయి. ఇక ఈ ఫలితాల్లో కృష్ణా జిల్లా విషయంలో ఓ సెంటిమెంట్ మరోసారి నిజమైంది

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. జిల్లాలకు జిల్లాలను ఫ్యాన్ క్లీన్ స్వీప్ చేసింది. ముఖ్యంగా టీడీపీకి కంచుకోట వంటి కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఫలితాలు పచ్చ శ్రేణులకు షాకిచ్చాయి.

ఇక ఈ ఫలితాల్లో కృష్ణా జిల్లా విషయంలో ఓ సెంటిమెంట్ మరోసారి నిజమైంది. అదేమిటంటే.. ఈ జిల్లా నుంచి మంత్రులుగా పని చేసిన వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవడమో లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవడమో ఖాయంగా జరుగుతోంది.

ఇప్పుడి ఆనవాయితీని కొనసాగిస్తూ చంద్రబాబు కేబినెట్‌లో మంత్రుగా పనిచేసిన దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర ఓటమి పాలయ్యారు. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ చేతిలో దేవినేని, బందరులో పేర్ని నాని చేతిలో కొల్లు పరాజయం పాలయ్యారు.

ఇక గతంలో చూస్తే.. 1985లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన వసంత నాగేశ్వరరావు, ఎర్నేని సీతాదేవి‌లు 1989 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ముక్కపాటి వెంకటేశ్వరరావు, కోనేరు రంగారావులు 1994 ఎన్నికల్లో ఓటమి చెందారు.

ఇక కృష్ణాజిల్లాలో టీడీపీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దేవినేని నెహ్రూ రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. 1994లో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి పదవి నిర్వహించిన నెహ్రూ... టీడీపీలో చీలిక సమయంలో రామారావు పక్షాన నిలిచారు.

చంద్రబాబుతో విబేధించి కాంగ్రెస్‌లో చేరారు. 1999 ఎన్నికల్లో నెహ్రూ ఓటమి పాలయ్యారు. టీడీపీకే చెందిన దేవినేని వెంకటరమణ, వడ్డే శోభానాధ్రీశ్వరరావు 1999 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రి పదవిని పొందారు.

అయితే వెంకటరమణ రైలు ప్రమాదంలో మరణించగా, 2004 ఎన్నికల్లో శోభనాధ్రీశ్వరరావు ఓడిపోయారు. ఇక 2004లో వైఎస్ మంత్రివర్గంలో మంత్రులుగా స్వీకరించిన కొనేరు రంగారావు, పిన్నమనేని వెంకటేశ్వరావు, మండలి బుద్ధప్రసాద్‌లు 2009 ఎన్నికలలో ఓడిపోయారు.

2009లో వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణాజిల్లా నుంచి కొలుసు పార్థసారథికి మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే 2014లో వైసీపీ నుంచి బందరు పార్లమెంట్ ‌ఎన్నికల్లో బరిలోకి దిగిన పార్థసారథి ఓటమి పాలయ్యారు.

2014లో బీజేపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచిన కామినేని శ్రీనివాస్ చంద్రబాబు మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ-బీజేపీల మధ్య విభేదాలు రావడంతో కామినేని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.

తాజాగా దేవినేని, కొల్లు ఓటమితో మంత్రులుగా పనిచేసిన కృష్ణాజిల్లా నేతలు తదుపురి ఎన్నికల్లో ఓడిపోవడమో, రాజకీయంగా చిక్కుల్లో పడటమో తప్పదనే సెంటిమెంట్‌కు బలం చేకూరినట్లయ్యింది. 
 

click me!
Last Updated May 24, 2019, 11:42 AM IST
click me!